బండరాయితో తండ్రిని హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రించి..

కొడంగల్‌ మండలంలో మంగళవారం తండ్రిని కుమారుడు హతమార్చిన కేసులో పోలీసులు విస్తుపోయే నిజాల్ని రాబట్టారు.

Published : 30 Mar 2023 05:20 IST

బీమా డబ్బు కోసమే హత్య..

కొడంగల్‌, న్యూస్‌టుడే: కొడంగల్‌ మండలంలో మంగళవారం తండ్రిని కుమారుడు హతమార్చిన కేసులో పోలీసులు విస్తుపోయే నిజాల్ని రాబట్టారు. సీఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం బిక్యానాయక్‌ తండాకు చెందిన శ్రీనివాస్‌ ఓ బీమా సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు తండ్రి పేరిట రూ.50 లక్షల బీమా చేయించాడు. ఆ డబ్బుల కోసమే అతడు తండ్రిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్‌ మంగళవారం తెల్లవారుజామున తాండూరు వెళ్లేందుకు తండ్రి ధన్‌సింగ్‌ (68)ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఉడిమేశ్వరం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో తండ్రి తలపై మోది హత్య చేశాడు. శవాన్ని ద్విచక్ర వాహనం వరకు లాక్కొని వెళ్లాడు. వాహనాన్ని కూడా స్వల్పంగా ధ్వంసం చేశాడు. కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి.. బండి మీది నుంచి పడి తండ్రి మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. మృతదేహాన్ని కొడంగల్‌కు తరలిస్తున్నారని చెప్పాడు. కుటుంబసభ్యులు కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. బండి అదుపు తప్పి పడిపోతే.. శ్రీనివాస్‌కు ఒక్క గాయం కూడా ఎందుకు కాలేదని అతడి అన్న రవినాయక్‌ అనుమానించారు. అదే విషయాన్ని సీఐకి చెప్పారు. నిందితుడిని సీఐ విచారణలో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని