పట్టాలపై ఆగిన దొంగల బొలెరో.. వేగంగా వచ్చి ఢీకొన్న దురంతో

దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై అత్యంత వేగంగా దూసుకుపోతోంది.. అదే సమయంలో కొంతమంది ఆగంతుకులు బొలెరో వాహనంతో దూసుకువచ్చారు.

Published : 31 Mar 2023 05:04 IST

ఇంజిన్‌ దెబ్బతిని 7 గంటల పాటు నిలిచిన రైలు  
తప్పించుకొని పారిపోయిన దుండగులు

భీమడోలు, న్యూస్‌టుడే: దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై అత్యంత వేగంగా దూసుకుపోతోంది.. అదే సమయంలో కొంతమంది ఆగంతుకులు బొలెరో వాహనంతో దూసుకువచ్చారు. హఠాత్తుగా అది పట్టాలపై నిలిచిపోయింది.. క్షణాల్లో దారుణం.. రైలు మెరుపు వేగంతో వచ్చి ఆ వాహనాన్ని ఢీకొంది. బొలేరో నుజ్జునుజ్జయింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద గురువారం తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పశువుల దొంగలుగా అనుమానిస్తున్న కొందరు బొలెరోలో వెళుతూ 16వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వేసి ఉన్న రైల్వే గేటును వాహనంతో వేగంగా ఢీకొట్టారు. గేటు ఒక వైపు ముక్కలైంది. మరో వైపు గేటునూ దాటించే క్రమంలో బొలెరో పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో దురంతో రైలు దూసుకొస్తుండటంతో దుండగులు వాహనాన్ని పట్టాలపైనే వదిలేసి పారిపోయారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో బొలెరో పూర్తిగా ధ్వంసమైంది. రైలు ఇంజినూ పాక్షికంగా దెబ్బతింది. 7 గంటలపాటు రైలు నిలిచిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు మరో ఇంజిన్‌ సాయంతో రైలును విశాఖపట్నానికి పంపించారు. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని