మెట్లబావి దుర్ఘటనలో 36కు పెరిగిన మృతులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇందౌర్‌ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మెట్లబావి దుర్ఘటనలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 36కు చేరింది.

Published : 01 Apr 2023 11:48 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇందౌర్‌ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మెట్లబావి దుర్ఘటనలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 36కు చేరింది. స్థానిక పటేల్‌నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ ఝూలేలాల్‌ గుడిలో యాభై అడుగుల లోతు ఉన్న బావిపై వేసిన శ్లాబు కూలి.. అందులో పడిపోయిన భక్తుల్లో 36 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నాలుగు దశాబ్దాల క్రితం మెట్లబావిని కప్పి బేలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయాన్ని విస్తరించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. దుర్ఘటన అనంతరం 14 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించామని, వారిలో ఇద్దరు డిశ్చార్జి అయినట్లు ఇందౌర్‌ జిల్లా కలెక్టర్‌ ఇళయరాజా తెలిపారు. ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శుక్రవారం మంత్రులతో కలిసి ఆలయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా స్థానికులు కొందరు నినాదాలు చేశారు. ఈ ప్రమాదంలో తమ  ఆత్మీయులను పోగొట్టుకొన్న బాధితుల్లో 8 కుటుంబాలు ఆ విషాదాన్ని అధిగమించి అవయవ దానానికి అంగీకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రమాదానికి బాధ్యులుగా మహదేవ్‌ ఝూలేలాల్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శిపై ఐపీసీ సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేసినట్లు ఇందౌర్‌ సీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని