Gangster Atik Ahmed: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ కాల్చివేత

రాజకీయ నేతగా ఎదిగిన  ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు.

Updated : 16 Apr 2023 11:03 IST

కాల్పుల్లో అతడి సోదరుడూ మృతి
ప్రయాగ్‌రాజ్‌లో పోలీసుల సమక్షంలోనే ఘటన
ముగ్గురిని అరెస్టు చేశాం: పోలీసులు

ప్రయాగ్‌రాజ్‌: రాజకీయ నేతగా ఎదిగిన  ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. ఒక వైద్య కళాశాల వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అతీక్‌ అహ్మద్‌ సమాజ్‌వాదీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. వైద్య పరీక్షల కోసం అతీక్‌, అష్రాఫ్‌లను తరలిస్తుండగా మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలడుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చారు. మొదట అతీక్‌ కణతపై పెట్టి ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఆ తర్వాత కింద పడ్డాకా వారిద్దరిపై కాల్పులు కొనసాగాయి. ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పుల ఘటనకు కారకులుగా భావిస్తూ ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ఒక పోలీసుకూ గాయాలయ్యాయి. బుల్లెట్‌ గాయాలతో ఉన్న అతీక్‌, అష్రాఫ్‌ మృతదేహాలను పోలీసులు సంఘటనాస్థలి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు.

గతంలో జరిగిన ఉమేశ్‌పాల్‌ కిడ్నాప్‌ కేసు విచారణలో భాగంగా వారిద్దరినీ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలకు తరలిస్తుండగా కాల్పులు జరిగాయి. అతీక్‌పై దాదాపు 100 క్రిమినల్‌ కేసులున్నాయి. అతడి కుమారుడు అసద్‌ గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. గుంపులోంచి కొంత మంది అతి సమీపం నుంచి అతీక్‌, అతడి సోదరుడిపై కాల్పులు జరిపారని, ఆ సమయంలో వారి పక్కనే తానున్నానని అతీక్‌ న్యాయవాది తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన అసద్‌ అహ్మద్‌ అంత్యక్రియలు శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ ముగిశాయి. ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న అసద్‌, అతడి సహచరుడైన గులాం ఝాన్సీవద్ద జరిగిన ఎన్‌కౌంటరులో హతమైన విషయం విదితమే. సకాలంలో కోర్టు అనుమతి లభించని కారణంగా కుమారుడి అంత్యక్రియలకు అతీక్‌ అహ్మద్‌ హాజరు కాలేద]ు. శనివారం ఓవైపు అసద్‌ అంత్యక్రియలు జరుగుతుండగా.. అక్కడికి 3 కి.మీ.ల దూరంలోని ధూమన్‌గంజ్‌ స్టేషనులో అతీక్‌ అహ్మద్‌ను, అష్రాఫ్‌ను  పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా వారిద్దరినీ కాల్చి చంపారు. అతీక్‌ అహ్మద్‌ ఐదుగురు కుమారుల్లో అసద్‌ మృతి చెందగా.. మిగతా నలుగురిలో ఇద్దరు జైల్లో, మైనర్లయిన మరో ఇద్దరు గృహ నిర్బంధంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని