నేర సామ్రాజ్యం ఏలాలని..తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి..

తుపాకీ పట్టిన ప్రతి ఒక్కడూ డాన్‌ అవుదామనుకుంటాడు. అలానే అనుకున్నారు అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను చంపిన నిందితులు కూడా.

Updated : 17 Apr 2023 06:56 IST

అతీక్‌ హత్య కేసు నిందితుల నేపథ్యమిదీ..

ప్రయాగ్‌రాజ్‌: తుపాకీ పట్టిన ప్రతి ఒక్కడూ డాన్‌ అవుదామనుకుంటాడు. అలానే అనుకున్నారు అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను చంపిన నిందితులు కూడా. వీరంతా గతంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారే. తల్లిదండ్రులు, సోదరుల మాటలను పెడచెవిన పెట్టి అక్రమ మార్గాల్లో ప్రయాణించిన వారే. అయితే నేర సామ్రాజ్యంలో తమకంటూ ఒక పేరు ఉండాలన్న తపన.. ఈ సామాన్య నేరగాళ్లను నేడు కరడుగట్టిన హంతకులుగా నిలబెట్టింది.

లవ్లేశ్‌ తివారీ (22)

బందా జిల్లా నివాసి. రెండు సంవత్సరాల క్రితం నడిరోడ్డుపై ఓ అమ్మాయి చెంప పగలకొట్టిన కేసులో నిందితుడు. ఆ కేసులో జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులు లవ్లేశ్‌తో సంబంధాలు తెంచుకున్నారు. ‘‘అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళతాడో.. ఏం చేస్తాడో మాకు తెలియదు. అడిగినా చెప్పడు. మేం వాడితో మాట్లాడం. పనీ పాటా ఏమీ చేయడు. రోజంతా గంజాయి మత్తులో ఉంటాడు’’ అని లవ్లేశ్‌ తండ్రి యజ్ఞతివారీ తెలిపారు. గతంలో జైలు కెళ్లిన చరిత్ర లవ్లేశ్‌కు ఉంది.

సన్నీ(23)

హమీర్‌పుర్‌లోని కురారా నివాసి. 15 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పారిపోయాడు. ఇతడిపై చాలా కేసులు ఉన్నాయి. ‘‘అందరి కుర్రాళ్లలానే ఉండేవాడు. ఒకసారి ఓ గొడవలో జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి అతడి మానసిక స్థితి మారిపోయింది.. నేరాలు చేయడం ప్రారంభించాడు. హమిర్‌పుర్‌ జైలులో ఏడాది పాటు ఉన్నాడు’’ అని గ్రామస్థులు తెలిపారు. 

అరుణ్‌మౌర్య (18)

కాస్‌గంజ్‌లోని బఘేలా గ్రామ నివాసి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. పదేళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయాడు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2014-15లో కాస్‌గంజ్‌ బరేలి-ఫరూఖ్‌బాద్‌ రైల్వే మార్గంలో రైలు దోపిడీ ఘటనలో నిందితుడు. ఆ కేసులో అడ్డు వచ్చిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను హత్య చేశాడు. జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి అరుణ్‌పై పలు కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇతడికి ఇద్దరు సోదరులు. వారు దిల్లీలో తుక్కు వ్యాపారం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని