అపహరించి.. హత్య చేసి.. దహనం: వీడిన అదృశ్యం కేసు మిస్టరీ

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన కావలి భారతయ్య (55) అదృశ్యం కేసు మిస్టరీ ఏపీలోని కర్నూలు జిల్లాలో వీడింది.

Updated : 03 Jul 2023 06:59 IST

పోలీసుల అదుపులో నిందితులు

కర్నూలు, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన కావలి భారతయ్య (55) అదృశ్యం కేసు మిస్టరీ ఏపీలోని కర్నూలు జిల్లాలో వీడింది. హంతకులు ఆయన్ను అపహరించి.. అనంతరం చంపి కల్లూరు మండలం ఉలిందకొండ పోలీసుస్టేషన్‌ పరిధిలో దహనం చేసిన ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. గతంలో కల్లు దుకాణం నిర్వహించిన రామకృష్ణాపురానికి చెందిన రవీంద్రగౌడ్‌ భార్య మూడేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. రవీంద్రగౌడ్‌ వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులంతా అతన్ని కొట్టారు. భారతయ్య చెప్పుతో కొట్టడంతో రవీంద్రగౌడ్‌ అతనిపై కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి  వచ్చిన అతను భారతయ్యను చంపేందుకు కుట్ర పన్నాడు. జైలులో పరిచయమైన మహ్మద్‌ షఫీతో చేయి కలిపాడు. ఈ ఏడాది జూన్‌ 26న ఆటో కోసం అప్పరాల గ్రామం వద్ద ఎదురుచూస్తున్న భారతయ్యను ఊరికి వెళ్దాం పదా అంటూ రవీంద్రగౌడ్‌ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశాడు. రుమాలుతో గొంతు బిగించి ఐరన్‌ రాడ్డుతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి కల్లూరు మండలం కొల్లంపల్లి తండా సమీపంలో పడేసి పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. భారతయ్య ఇంటికి రాకపోవడంతో అతని భార్య శివమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు రవీంద్రగౌడ్‌ను విచారించడంతో విషయం బయటపడింది. కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై మంజునాథ్‌రెడ్డి, ఉలిందకొండ ఎస్సై నల్లప్ప ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని