హైవేపై దోపిడీ దొంగల బీభత్సం: ఆటోడ్రైవర్‌పై కత్తులతో దాడి.. సొత్తు కోసం మహిళ హత్య

దారి దోపిడీ దొంగలు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. ఓ మహిళను హత్య చేసి ఆటోడ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు.

Updated : 18 Jul 2023 07:17 IST

తుని సమీపంలో దారుణం

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: దారి దోపిడీ దొంగలు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. ఓ మహిళను హత్య చేసి ఆటోడ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ దమ్ము దుర్గారావు ఆదివారం సాయత్రం అన్నవరంలో ఉంటున్న కుమార్తెను చూసేందుకు తన ఆటోలో వెళ్లారు. రాత్రి తిరిగొస్తుండగా తేటగుంట వద్ద ఇద్దరు ఆటో ఎక్కారు. రాజులకొత్తూరు సమీపంలోకి వచ్చాక వారిద్దరూ దుర్గారావును డబ్బులు అడగ్గా నిరాకరించారు. దీంతో ఆయన్ను కత్తులతో పొడిచి ఆటోలోనుంచి నెట్టేశారు. ఆ ఇద్దరు దుండగులు అదే ఆటోలో వెళ్లి ఎర్రకోనేరు వద్ద రోడ్డు పక్కన కిళ్లీబడ్డీ నిర్వహిస్తున్న పప్పు సత్యవతి అనే మహిళను డబ్బులు, బంగారం డిమాండ్‌ చేశారు. ఏమీ లేవని ఆమె చెప్పడంతో కత్తులతో దాడి చేశారు. కేకలు విన్న ఆమె పెద్ద్ద కుమార్తె నాగమణి, చుట్టుపక్కలవారు వచ్చినా.. వారిని కూడా బెదిరించి దుండగులు పారిపోయారు. గాయపడ్డ సత్యవతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆటోడ్రైవర్‌ దుర్గారావు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీశ్‌కుమార్‌.. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను నియమించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని