Kakinada: 6 నెలల క్రితం కుక్క కాటు.. తాజాగా రేబిస్‌ సోకి బాలుడి మృతి

కుక్క కరిచిందన్న విషయం ఇంట్లో చెప్పకుండా నిర్లక్ష్యం వహించడంతో రేబిస్‌ బారిన పడి 17 ఏళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 24 Jul 2023 07:18 IST

కరిచినపుడు ఇంట్లో చెప్పని వైనం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కుక్క కరిచిందన్న విషయం ఇంట్లో చెప్పకుండా నిర్లక్ష్యం వహించడంతో రేబిస్‌ బారిన పడి 17 ఏళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. గొల్లప్రోలుకు చెందిన తేలు ఓంసాయిని ఆరు నెలల కిందట వీధి కుక్క కరవగా భయపడి ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల నుంచి జ్వరం బారిన పడిన బాధితుడు.. మంచినీళ్లు తాగలేకపోవడం, నీటిని చూసి భయపడుతుండటంతో కుటుంబసభ్యులు శనివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ వ్యాధి ముదరడంతో ఆదివారం మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం కూడా తమ కుమారుడ్ని కుక్క కరిచిందని, అప్పుడు వైద్యం చేయించామని తల్లిదండ్రులు వాపోయారు. మృతుడి తండ్రి హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేతికందొస్తున్న కుమారుడు మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిర్లక్ష్యం తగదు..

కుక్క కాటుకు గురైనవారు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని గొల్లప్రోలు పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్యామల సూచించారు. ‘ప్రమాదానికి గురైన రోజున యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌తోపాటు టీటీ ఇంజక్షన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజున వ్యాక్సిన్‌ తీసుకోవాలి. దీంతో రేబీస్‌ ముప్పు తప్పుతుంది. చికిత్స సమయంలో మనల్ని కరిచిన కుక్కను గమనిస్తూ ఉండాలి. ఆ కుక్క వెంటనే చనిపోయినా, ఎక్కువ మందిని గాయపరిచినా పిచ్చికుక్కగా భావించి మరింత మెరుగైన వైద్యం పొందాలి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని