Kakinada: అయ్యో పాపం.. నాటుతుపాకీ పేలి చిన్నారి మృతి

తల్లిదండ్రులకు ముద్దుముద్దు మాటలు చెబుతూ.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. ఏం జరిగిందోనని వెళ్లి బిడ్డను ఒడిలోకి తీసుకోగా.. వారి చేతులు రక్తంతో తడిసిపోయాయి.

Updated : 16 Aug 2023 07:21 IST

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులకు ముద్దుముద్దు మాటలు చెబుతూ.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. ఏం జరిగిందోనని వెళ్లి బిడ్డను ఒడిలోకి తీసుకోగా.. వారి చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఉలుకూపలుకూ లేకుండా పడిపోయిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పలివెల రాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ధన్యశ్రీ(4) మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటుండగా పక్క ఇంట్లో నాటు తుపాకీ పేలి.. ఆ బుల్లెట్‌ వచ్చి ధన్యశ్రీకి తగిలింది. క్షణకాలంలో జరిగిపోయిన ఘటనలో బుల్లెట్‌ చిన్నారి వీపులో నుంచి ఛాతిలోకి దూసుకుపోయింది. ఏమైందో అర్థం కాని తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ సీఐ సన్యాసిరావు, ఎస్సై విజయబాబు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ధన్యశ్రీ ఇంటికి సమీపంలో ఉన్న సిద్ధాంతపు దుర్గాప్రసాద్‌ పందిని కాల్చేందుకు నాటు తుపాకీలో మందుగుండును దట్టిస్తుండగా అది పొరపాటున పేలి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని