బైక్‌పై వెళుతూ విద్యార్థిని చున్నీ లాగారు.. మరో వాహనం ఢీకొని బాలిక దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌ జిల్లాలో ఓ స్కూలు విద్యార్థిని (16) ముగ్గురు ఆకతాయిల వేధింపులకు బలైంది.

Updated : 18 Sep 2023 07:32 IST

పోలీసుల కాల్పుల్లో ఆకతాయిలకు గాయాలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌ జిల్లాలో ఓ స్కూలు విద్యార్థిని (16) ముగ్గురు ఆకతాయిల వేధింపులకు బలైంది. 11వ తరగతి చదువుతున్న ఆమె సహ విద్యార్థినితో కలిసి పాఠశాల నుంచి సైకిలుపై ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన యువకులు చున్నీ లాగారు. ఊహించని ఈ ఘటనతో కిందపడిపోయిన విద్యార్థినిని మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. హంసవర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో శనివారం రాత్రి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆదివారం వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు కావడం గమనార్హం. అంబేడ్కర్‌నగర్‌ ఎస్పీ అజిత్‌ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. పోక్సో, హత్య కేసులు నమోదు చేసి నిందితులు షహబాజ్‌, ఫైసల్‌తోపాటు మరో మైనరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి  తీసుకువెళుతుండగా వాహనంలోంచి దూకి పారిపోవాలని చూశారు. ఈ ప్రయత్నంలో ఓ పోలీసు వద్ద తుపాకీ లాక్కొని కాల్పులు కూడా జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరి కాళ్లలోకి తూటాలు దిగడంతో అక్కడే కూలిపోయారు. పరుగెత్తుతూ కిందపడిపోయిన బాలుడి కాలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. ఈ ముగ్గుర్నీ వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని