Peddapalli: ఊపిరాడకుండా చేసి.. పాముతో కాటు వేయించి..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్‌ కొచ్చెర ప్రవీణ్‌ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్‌ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 14 Oct 2023 08:05 IST

స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
భార్య సహా ఆరుగురి అరెస్ట్‌

గోదావరిఖని, పెద్దపల్లి- న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్‌ కొచ్చెర ప్రవీణ్‌ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్‌ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్దపల్లిలో డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ప్రవీణ్‌, లలిత దంపతులకు 14, 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్లుగా ప్రవీణ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే విషయం తెలుసుకున్న భార్య లలిత.. నిత్యం గొడవపడేది. భర్తలో మార్పు కనిపించకపోవడంతో అంతమొందించాలని నిర్ణయించుకుంది.

ప్రవీణ్‌ వద్దే సెంట్రింగ్‌ పనులు నిర్వహించే రామగుండం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేశ్‌ (37)తో ఈ విషయం చెప్పింది. ప్రవీణ్‌ను హత్య చేస్తే ఒక ప్లాట్‌ ఇస్తానని చెప్పడంతో అంగీకరించిన సురేశ్‌.. రామగుండానికి చెందిన ఇందారపు సతీష్‌(25), మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌(33), భీమ గణేశ్‌(23)లతో కలిసి హత్యకు పథకం రచించాడు. పాముతో కాటు వేయించాలన్న పథకం మేరకు మందమర్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్‌(38)తో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వీరి ఖర్చుల కోసం లలిత 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది. ఈ నెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు.. లలితతో ఫోన్‌లో మాట్లాడి ద్విచక్ర వాహనాలపై ఇంటికి చేరుకున్నారు.

పడుకున్న ప్రవీణ్‌ను చూపించి లలిత మరో గదిలోకి వెళ్లి వేచిచూసింది. నిందితులు ప్రవీణ్‌ ముఖంపై దిండుతో అదిమిపట్టారు. కొద్దిసేపు పెనుగులాడిన ప్రవీణ్‌లో కదలిక నిలిచిన తర్వాత వెంట తెచ్చిన పాముతో కాటు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పామును బహిరంగ ప్రదేశంలో వదిలేశారు. గుండెపోటుతో చనిపోయాడని లలిత చెప్పిన మాటలను నమ్మని ప్రవీణ్‌ తల్లి.. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కుట్ర బయటపడడంతో.. లలిత సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్‌లు, 34 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని