Train Accident: రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

బాసర సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జిల్లాకేంద్రంఓని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Updated : 21 Oct 2023 10:20 IST

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: బాసర సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన రామచంద్రరావు(45) ఖమ్మం పట్టణానికి చెందిన సునీతతో 17 ఏళ్ల కింద వివాహమైంది. ఆయన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె జస్మిత ఇంటర్‌ చదువుతుండగా, చిన్న కుమార్తె జనని(15) పదో తరగతి చదువుతోంది. శుక్రవారం బాసరలో సరస్వతీ దేవికి పూజ చేసేందుకు నలుగురు గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రైలులో బయలుదేరారు. రామచంద్రరావు, సునీత ఒక బోగీలో, ఇద్దరు కుమార్తెలు మరో బోగీ ఎక్కారు. నిజామాబాద్‌లో అందరూ ఒకే బోగీలోకి మారేందుకు రైలు దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తె జస్మితను ఎక్కించారు. చిన్న కుమార్తె జననిని అదే బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి రామచంద్రరావు సైతం రైలు, పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. జనని ఆక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలైన రామచంద్రరావును స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లెదుటే భర్త, చిన్న కుమార్తె మృతి చెందడంతో సునీత కుప్పకూలిపోయింది. వారి మృతదేహాలపై పడి ఆమె విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని