Tirumala: లోగుట్టు పెరుమాళ్లకెరుక!

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనం చిక్కినా పోలీసులు ఎంతకూ కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Updated : 10 Nov 2023 07:26 IST

తిరుమల ఘాట్‌లో ఎర్రచందనం అక్రమ తరలింపు
అలిపిరి పోలీస్‌స్టేషన్‌ దగ్గర వాహనం మాయంపై అనుమానాలు
ఎట్టకేలకు కేసు నమోదు

ఈనాడు, తిరుపతి-తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుమల ఘాట్‌ రోడ్డులో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనం చిక్కినా పోలీసులు ఎంతకూ కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ కారు అతి వేగంగా మొదటి ఘాట్‌ రోడ్డు మీదుగా అలిపిరిలోని ప్రయాణ సమయం నమోదు కేంద్రం దగ్గరకు వచ్చింది. అందులో ఎర్రచందనం దుంగలను గుర్తించిన సిబ్బంది... తితిదే, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రైవరును అదుపులోకి తీసుకొని, వాహనాన్ని అలిపిరి పీఎస్‌కు తరలించారు. ఉదయం 8 గంటల వరకు అలిపిరి పీఎస్‌ ముందున్న ఎర్రచందనం వాహనాన్ని.. ఎవరి ఆదేశాలతోనే పక్కనున్న వార్డు సచివాలయం వద్దకు మార్చారు. ఉదయం ఆ వాహనాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డితో పాటు పలువురు మీడియా ప్రతినిధులు వీడియోలు తీశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆ వాహనం మాయమైంది. దీనిపై పోలీసుల్లో ఎలాంటి హడావుడీ కనిపించలేదు. అదుపులో ఉన్న వ్యక్తి గురించి వివరాలు వెల్లడించలేదు. ఘటన జరిగి 20 గంటలపైనే అవుతున్నా.. కేసు నమోదు చేయలేదు. ఆ కేసు తమది కాదని తిరుమల-2 టౌన్‌ పోలీసులు అంటే... మాకేం సంబంధమని అలిపిరి పోలీసులు పేర్కొన్నారు. 

కేసు నమోదు చేశాం: అలిపిరి పోలీసులు

ఎర్ర చందనం అక్రమ రవాణా వాహనం తమ ఆధీనంలో ఉందని.. తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అలిపిరి పోలీసులు గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన రాజ వెంకటేశన్‌ (30)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. 

కనుమ దారిలోకి ఎర్రదుంగలు ఎలా వచ్చాయి?

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు నుంచి అలిపిరికి వచ్చిన వాహనంలో ఎర్రచందనం పట్టుకోవడం.. ఆపై ఆ వాహనం మాయమవడంతో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శేషాచల అటవీ ప్రాంతంలోని వివిధ మార్గాల్లో అక్రమార్కులు ఎర్రచందనాన్ని తరలిస్తుంటారు. ఏకంగా తిరుమల కనుమ దారిలోనే తరలించడంతో, ఎర్రచందనం దుంగలను ఎక్కడ వాహనంలోకి ఎక్కించారు.. ఘాట్‌రోడ్డులోకి ఎలా మరల్చారు.. ఇంత తేలిగ్గా ఇదంతా జరిగితే తిరుమల భద్రతకు 24 గంటలు పనిచేస్తున్న నిఘా ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు వస్తున్నాయి. తిరుమల ఘాట్‌ రోడ్డుకు సమీపంలో ఎర్రచందనం ఉన్నా దుంగలను నరికినట్లు అటవీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఎక్కడా గుర్తించలేదు. మొదటి కనుమ మార్గంలో తరలించడంపై దృష్టిసారించాల్సి ఉండగా.. పట్టుకున్న కారు ఏమైందో చెప్పకపోవడం వెనుక పెద్దల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలిపిరి మొదటి ఘాట్‌ రోడ్డు చెక్‌ పాయింట్‌ నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేయరు. నిర్దేశిత సమయంలోగా వాహనాలు వస్తున్నాయా లేవా అనే పరిశీలిస్తారు. వాహనం వేగంగా రావడంతో సిబ్బంది పరిశీలించగా బయటపడింది. గతంలోనూ ఇదే తరహాలో తరలించారా అనే అనుమానాలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఘాట్‌రోడ్డు సమీపంలో ఎర్రచందనం దుంగలను పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ హడావుడికి శేషాచల అటవీ ప్రాంతంలోని చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వచ్చి, భక్తులపై దాడి చేస్తున్నాయన్న వాదనలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని