Kakinada: యువ వైద్యుడి విషాదాంతం

భూమి విషయమై ఎమ్మెల్యే సోదరుడు మోసం చేయడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కాకినాడకు చెందిన శేషారత్నం ఆరోపించారు.

Updated : 27 Nov 2023 08:07 IST

ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడే ఆత్మహత్యకు కారణమని మృతుడి తల్లి ఆరోపణ
సాయంత్రానికల్లా మాట మార్పు
దర్శకుడు కల్యాణ్‌ కృష్ణకు సంబంధం లేదని వెల్లడి

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, సర్పవరం, మసీదుసెంటర్‌, కలెక్టరేట్‌: భూమి విషయమై ఎమ్మెల్యే సోదరుడు మోసం చేయడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కాకినాడకు చెందిన శేషారత్నం ఆరోపించారు. ఆదివారం ఉదయం అంతా అలా చెప్పిన ఆమె.. మళ్లీ సాయంత్రానికి మాట మార్చి, ఈ ఆత్మహత్యతో ఎమ్మెల్యే కన్నబాబుకు గానీ, ఆయన సోదరుడు కల్యాణ్‌కృష్ణకు గానీ సంబంధం లేదన్నారు. కాకినాడలో చోటుచేసుకున్న ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. కాకినాడ నేతాజీ వీధిలో ఉండే నున్న శ్రీకిరణ్‌చౌదరి (33) శనివారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి, గడ్డిమందు తాగి ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12.50 గంటలకు మృతిచెందారు. శ్రీకిరణ్‌ రష్యాలో వైద్యవిద్య అభ్యసించేవారు. కొవిడ్‌ సమయంలో తండ్రి మరణంతో స్వదేశానికి వచ్చేశారు. శనివారం సాయంత్రమే ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆదివారం సాయంత్రం పంచనామా నిర్వహించిన పోలీసులు.. రాజకీయ కారణాలేమీ లేవని, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని వెల్లడించారు.

ఇదీ వివాదం

మృతుడు శ్రీకిరణ్‌ కుటుంబీకుల కథనం ప్రకారం.. కాకినాడవాసి నున్న విశ్వనాథ చౌదరికి గొల్లప్రోలు మండలం చెందుర్తి దగ్గర 12.50 ఎకరాల భూమి ఉంది. ఇందులో అయిదు ఎకరాల విషయంలో వివాదం నడుస్తోంది. మరో ఆరు ఎకరాలు సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి రూ. 50 లక్షలు అప్పు తెచ్చారు. తండ్రి మరణం తర్వాత అప్పు తీర్చాల్సిన బాధ్యత కుమారుడు కిరణ్‌పై పడింది. దీంతో ఆయన ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌ను ఆశ్రయించారు. వివాదంలో ఉన్న అయిదు ఎకరాలు కొంటామనడంతో.. ఎకరం రూ. 30 లక్షలకు అమ్మేలా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత కిరణ్‌కు కొంత సొమ్ము ఇచ్చారు. మిగిలిన లావాదేవీల్లో జాప్యం చోటుచేసుకుంది. శనివారం వెళ్లి అడిగితే.. ఇంక ఇవ్వాల్సిందేమీ లేదని ఎమ్మెల్యే సోదరుడు, మధ్యవర్తి చెప్పడంతో మనస్తాపానికి గురై కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

తల్లి ఏమన్నారంటే..

‘ఎమ్మెల్యే కన్నబాబు తమ్ముడు కల్యాణ్‌కృష్ణ నా కుమారుడి దగ్గర భూమి పత్రాలు తీసుకున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వం.. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అచ్చంపేటకు చెందిన మధ్యవర్తి పెదబాబు అన్నారు. నా కుమారుడు శనివారం ఇంటికొచ్చి ఏడ్చేశాడు. ఇంతలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కొడుకు చదువు మానేసి వచ్చి ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లి పెదబాబు గొడవపెట్టారు. కన్నబాబు దగ్గర ఉండే బాలాజీ కూడా మరో భూమి అమ్మకానికి సంబంధించి ఇవ్వాల్సిన రూ. 29 లక్షలు ఇవ్వలేదు. దానినీ సెటిల్‌ చేస్తానని కల్యాణ్‌ మాటిచ్చి చేయలేదు’ అని ఆదివారం ఉదయం ఆమె చెప్పారు. అయితే, సాయంత్రం మరోలా మట్లాడారు. తన కుమారుడి ఆత్మహత్యతో కన్నబాబుకు, కల్యాణ్‌కు సంబంధం లేదన్నారు. వాళ్లూ వీళ్లూ, తమ కుమారుడి స్నేహితులు చెప్పడంతోనే అలా చెప్పానన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు.


మా తమ్ముడు జాలిపడి నగదు ఇచ్చాడు
- కురసాల కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే

‘మా అమ్మకు క్యాన్సర్‌, వైద్యం చేయించడానికి డబ్బులు అవసరం.. మా భూమి కొనుక్కోండి’ అని శ్రీకిరణ్‌ మా దగ్గరకు వచ్చి మా తమ్ముడు కల్యాణ్‌కృష్ణను బతిమిలాడాడు. కల్యాణ్‌ జాలిపడి భూమి కొనడానికి సిద్ధమై డబ్బులు ఇచ్చాడు. ఆ భూమి అప్పటికే వేరేవారికి అమ్మేశాడని తెలిసింది. కిరణ్‌ చౌదరే మా తమ్ముడిని మోసం చేశాడు. మాకే అతని దగ్గర్నుంచి డబ్బు రావాలి. ఆత్మహత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు.


శ్రీకిరణ్‌ మోసం చేశారు
- వీరంరెడ్డి పెదబాబు, కన్నబాబు అనుచరుడు

దర్శకుడు కల్యాణ్‌కృష్ణను శ్రీకిరణ్‌ మోసం చేశారు. భూమి అమ్ముతానని చెప్పి అడ్వాన్స్‌ తీసుకుని నాలుగు నెలలు కనపడలేదు. అప్పటికే వీరభద్రరావు అనే వ్యక్తికి ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిసి నిలదీస్తే.. ఆయనతో మాకు ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పారు. వీరభద్రరావుకు కల్యాణ్‌ నెలరోజుల క్రితం డబ్బు చెల్లించి, ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వకుండా శ్రీకిరణ్‌ ఇబ్బందిపెట్టారు.


ఇది వైకాపా భూబకాసురుల హత్యే
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కల్యాణ్‌ భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు శ్రీకిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. శ్రీకిరణ్‌కు చెందిన అయిదెకరాలను కొని డబ్బులివ్వకుండా.. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తన వద్దే ఉంచుకొని కల్యాణ్‌ వేధించారని వివరించారు. ఇది ముమ్మాటికీ వైకాపా భూబకాసురుల హత్యేనని ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని