భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ దహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

Updated : 29 Nov 2023 05:56 IST

 ఎన్నికల వేళ మావోయిస్టుల అలజడి

చర్ల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని లారీలో చర్లకు పంపిస్తుండగా మంగళవారం సాయంత్రం సాయుధ మావోయిస్టు మిలీషియా సభ్యులు దాన్ని పూసుగుప్ప శివారులో అడ్డుకున్నారు. లారీ డ్రైవర్‌ను, కూలీలను కిందకి దింపి, అనంతరం డీజిల్‌ పోసి లారీకి నిప్పంటించారు. ఘటనా ప్రాంతానికి 2.5 కి.మీ. దూరంలోనే సీఆర్పీఎఫ్‌ క్యాంపులు ఉన్నాయి. సీఆర్పీఎఫ్‌ బలగాలు, ఇతర వాహనాలు ఘటనాస్థలానికి రాకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. లారీకి నిప్పంటించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఏజెన్సీలో కలకలం రేపినట్లయింది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత మావోయిస్టులు పాల్పడిన దుశ్చర్య ఇదే. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఈ ఘటనపై ఆరా తీసి బలగాలకు పలు సూచనలిచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని