నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి మెసేజ్‌ పెట్టి యువకుడి ఆత్మహత్య

ఒక పక్క ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ఒత్తిళ్లు.. మరో పక్క ఇష్టపడిన యువతి నుంచి స్పందన తక్కువగా ఉండటం.. వీటితో మానసిక ఒత్తిడి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు.

Updated : 29 Nov 2023 12:01 IST

పందిళ్లపల్లి (వేటపాలెం), న్యూస్‌టుడే : ఒక పక్క ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ఒత్తిళ్లు.. మరో పక్క ఇష్టపడిన యువతి నుంచి స్పందన తక్కువగా ఉండటం.. వీటితో మానసిక ఒత్తిడి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పందిళ్లపల్లి రైల్వేస్టేషను సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గాదె వంశీకృష్ణ (22) డిగ్రీ చదివాడు. తల్లి చిన్నప్పుడే మృతి చెందగా తండ్రి ఊరు వదిలి వెళ్లిపోయాడు. దీంతో అమ్మమ్మ, తాతయ్య అతన్ని పెంచారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ద్వారా కారు తీసుకున్నాడు. దీని బకాయిలు చెల్లించాలని సంస్థ నుంచి ఒత్తిడి పెరిగింది. మరోపక్క ప్రేమించిన యువతి నిర్లక్ష్యం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెతో సోమవారం రాత్రి ఫోన్‌ ద్వారా ఛాటింగ్‌ చేస్తూ చరవాణి ఆపద్దని కోరాడు. దీంతో ఆమె ఇద్దరిలో ఎవరో ఒకరం చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని సందేశం పంపింది. నీవెందుకు.. నేనే చనిపోతానని సందేశం పెట్టి.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్లిన మేనమామ కిరణ్‌కుమార్‌ ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై జి.సురేష్‌ వెళ్లి.. వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని