టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!

రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు.

Updated : 30 Nov 2023 16:02 IST

తెనాలి కేంద్రంగా రైల్వేలో వసూళ్లపర్వం!  
చీరాలలో నకిలీ టీటీఈల గుట్టురట్టు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. ఈ వ్యవహారం చీరాలలో గుట్టురట్టయింది. దీనిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులను మంగళవారం బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన కల్యాణ్‌, గణేష్‌, మహబూబాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ నిరుద్యోగులు. డిగ్రీ వరకు చదివిన వారికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్‌ పరిచయమయ్యాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి, వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేశాడు. తర్వాత వారికి టీసీ ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి నకిలీ ఐడీ కార్డులు, జరిమానా పుస్తకాలు అందజేశాడు. శిక్షణ పేరుతో విజయవాడ-ఒంగోలు మధ్య రైళ్లలో తిరుగుతూ రోజుకు కనీసం మూడు కేసులు రాయాలని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ యువకులు కొద్దిరోజులుగా టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా వేస్తూ ఆ డబ్బు తెచ్చి తెనాలి వ్యక్తికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో రోజూలాగే చీరాల రైల్వే స్టేషన్‌లో కేసులు రాస్తున్న గణేష్‌ను స్థానిక టీటీఈ రాజేష్‌ గమనించి, అనుమానం వచ్చి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆయన రైల్వే పోలీసులకు చెప్పగా వారు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన అసలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు నకిలీ టీసీలు ఉన్నారని అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకులు నిజమే చెబుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ చదివిన యువకులు టీసీ ఉద్యోగాలంటే నమ్మి డబ్బులు ఇవ్వడం.. ట్రైనింగ్‌లో భాగంగా జరిమానాలు వసూలు చేసి తెమ్మంటే అతడికి తీసుకువెళ్లి ఇవ్వడం వంటి విషయాలు నమ్మశక్యంగా లేవని, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్న నేరం కావచ్చని కొందరు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని