స్వపక్ష నాయకుడిపైనే ఎంపీ కేసు

కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్‌లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్‌ రవికాంత్‌ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు.

Updated : 30 Nov 2023 06:41 IST

పోలీసుల అదుపులో నిందితుడు!
కుటుంబీకులు స్టేషన్‌ చుట్టూ తిరిగినా నిష్ఫలమే!

గుంటూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్‌లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్‌ రవికాంత్‌ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఆయన జాడ లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎంపీ నందిగం సురేష్‌ను ఫోన్‌లో దూషించారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు మేరకు రవికాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 48 గంటలు గడిచినప్పటికీ ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచకపోవడం వెనుక ఎంపీ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీ సురేష్‌కు, రవికాంత్‌కు గతంలో సత్సంబంధాలు ఉన్నాయి. ఓసారి ఎంపీ గురించి మరొకరి వద్ద రవికాంత్‌ తప్పుగా మాట్లాడారని చెబుతున్నారు. విషయం తెలిసిన ఎంపీ ఫోన్‌లో రవికాంత్‌ను నిలదీశారని, వారి మధ్య వాగ్వాదమేర్పడిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తన స్నేహితులు విజయ్‌, నాగబాబు, రామచంద్రరాజులతోనూ ఎంపీని తిట్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీని కించపర్చేలా ఆయన ఫోన్‌ వాట్సప్‌కు సందేశాలు పంపారని ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలో కేసు నమోదై పోలీసులు రవికాంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో కుటుంబసభ్యులు తుళ్లూరు స్టేషన్‌కు వెళ్లి ఎంపీ తమకు తెలుసని, మాట్లాడుకుంటామంటూ బతిమాలినా పోలీసులు సర్దిచెబుతూ పంపిస్తున్నారని తెలుస్తోంది. ఎంపీని ఆశ్రయించినప్పటికీ నిష్ఫలమైనట్లు సమాచారం. సొంత పార్టీ నాయకుడిపైనే ఎంపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. రవికాంత్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని పంపించేశామని పోలీసులు వివరణ ఇస్తున్నారు. మంగళవారం కూడా రవికాంత్‌.. తల్లితో కలిసి తమ వద్దకు వచ్చారన్నారు. ఎంపీతో తాము మాట్లాడుకుంటామని, కేసు వద్దని కోరారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రవికాంత్‌కు 41ఏ నోటీసునిచ్చి పంపించామని వివరించారు. మరోవైపు రవికాంత్‌ను ఇప్పటికీ పోలీసులు విడిచిపెట్టలేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. స్టేషన్‌లోనే ఉంచి లేరని చెబుతున్నారా? వేరే చోటకు తరలించి ఇబ్బంది పెడుతున్నారా? అన్నది మిస్టరీగానే ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని