YSRCP Leader: అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం

వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.

Updated : 02 Dec 2023 07:45 IST

20 ఏళ్ల యువకుణ్ని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు
స్టూడెంట్‌ వీసాపై తీసుకెళ్లి వెట్టిచాకిరీ
స్థానికుడి ఫిర్యాదుతో కదిలిన అమెరికా పోలీసులు
సత్తారు వెంకటేశ్‌రెడ్డి సహా మరో ఇద్దరి అరెస్టు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- వినుకొండ గ్రామీణం: వైకాపా నేతల(YSRCP Leaders) అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పీవీసీ పైపులు, ఇనుపరాడ్లు, విద్యుత్తు తీగలతో కొడుతూ నరకం చూపించారు. పక్కటెముకలు కూడా విరిగిపోయేలా చితక్కొట్టారు. అతణ్ని బానిసలా  మార్చేసుకుని వెట్టిచాకిరీ చేయించారు. బాధితుడి దయనీయస్థితిని గమనించి స్థానికుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దాష్టీకం వెలుగుచూసింది. పోలీసులు బాధితుణ్ని సంరక్షించి వైకాపా నాయకుడైన సత్తారు వెంకటేశ్‌రెడ్డితో పాటు పెన్మత్స నిఖిల్‌, పెన్మత్స శ్రవణ్‌లను అరెస్టు చేశారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్‌ ఛార్లెస్‌ కౌంటీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

మానవ అక్రమ రవాణా, అపహరణ, ఆయుధాలతో దాడి అభియోగాలతో కేసు: ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సత్తారు వెంకటేశ్‌రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు సత్తారు పుష్పారెడ్డి కుమారుడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన సాధ్విక్‌రెడ్డి (మార్తాల పుల్లారెడ్డి) పేదరికాన్ని అలుసుగా తీసుకుని.. అమెరికాలో బాగా చదివించి ఉద్యోగమిప్పిస్తానంటూ ఏడాదిన్నర కిందట తనతో అతన్ని స్టూడెంట్‌ వీసాపై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ అతణ్ని ఓ బేస్‌మెంట్‌లో నిర్బంధించి వెట్టిచాకిరీ చేయించుకున్నారు. చెప్పిన పనిచేయకపోతే విపరీతంగా కొట్టేవారు. రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే పడుకోవటానికి అవకాశమిచ్చేవారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ హింస మరింత తీవ్రమైంది. స్థానికుడి ద్వారా బాధిత యువకుడి పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్‌రెడ్డి నివాసం వద్దకు వెళ్లగా ఆయన వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చారని గమనించిన బాధితుడు తనను రక్షించాలని కేకలు వేస్తూ ఒక్కసారిగా బయటకు వచ్చాడు. పోలీసులు అతణ్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం వెంకటేశ్‌రెడ్డితో పాటు అతనితో ఉంటున్న పెన్మత్స నిఖిల్‌, పెన్మత్స శ్రవణ్‌లపైన మానవ అక్రమ రవాణా, ధ్రువపత్రాల దుర్వినియోగం, హింస, ఆయుధాలతో దాడి, అపహరణ, వెట్టిచాకిరీ తదితర అభియోగాల కింద కేసు పెట్టి, అరెస్టు చేశారు.

ప్రభావవంతమైన రాజకీయ నాయకులతో

సంబంధాలు: ‘నిందితుడైన సత్తారు వెంకటేశ్‌రెడ్డికి భారత్‌లోని ప్రభావవంతమైన రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి. ధనబలం ఉంది. వాటిని ఆధారంగా చేసుకుని బాధితుణ్ని బెదిరించారు. అతణ్ని ఎప్పుడూ ఎవరో ఒకరు ఓ కంట కనిపెడుతూనే ఉండేవారు. ఇంటికి ఎప్పుడో ఒకసారి ఫోన్‌ చేయించి పక్కనే ఉండి మాట్లాడించేవారు. అది కూడా సాధారణ ఫోన్‌కాలే. వీడియోకాల్స్‌, ఫేస్‌టైమ్‌కు అనుమతించేవారు కాదు’ అని సెయింట్‌ ఛార్లెస్‌ కౌంటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ‘మా అబ్బాయి 20 రోజుల నుంచి ఫోన్‌ చేయలేదు. తనను కొట్టారని ఎవరో చెబితేనే నాకు తెలిసింది’ అని సాధ్విక్‌రెడ్డి తల్లి విమల చెప్పారు.

జగన్‌, విజయసాయిలతో ఫొటోలు: సత్తారు వెంకటేశ్‌రెడ్డి వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. వైఎస్‌ఆర్‌ ఆసరా ఫౌండేషన్‌ కో ఫౌండర్‌ కూడా. వైఎస్‌ఆర్‌టీఎఫ్‌, వైఎస్‌ఆర్‌టీయూసీ, వైఎస్‌ఆర్‌ డాక్టర్స్‌ సెల్‌ తదితర విభాగాల్లో కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతల్లో పనిచేసినట్లు చెప్పుకొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ తదితరులతో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు ఆయన ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ఉన్నాయి. వెంకటేశ్‌రెడ్డి తన తల్లి సత్తారు పుష్పారెడ్డిని వినుకొండ ఎంపీపీని చేయాలనే ఉద్దేశంతో రెండేళ్ల కిందట జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. అయితే ఆమెకు ఎంపీపీ పదవి దక్కకపోవటంతో అమెరికాకు వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని