అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం

హైదరాబాద్‌ నుంచి చీరాల వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్‌ బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటాక జిల్లా కేంద్రం నల్గొండ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మర్రిగూడ బైపాస్‌ సమీపంలో కాలిపోయింది.

Published : 05 Dec 2023 04:04 IST

గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి సజీవ దహనం
డ్రైవర్‌ అప్రమత్తతతో 35 మందికి తప్పిన ముప్పు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి చీరాల వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్‌ బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటాక జిల్లా కేంద్రం నల్గొండ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మర్రిగూడ బైపాస్‌ సమీపంలో కాలిపోయింది. అందులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు ఒంగోలుకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ నక్కల జోసఫ్‌ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అందరూ దిగిపోవాలంటూ కేకలు వేశారు. ప్రయాణికులంతా హుటాహుటిన కిందకు దిగారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం మొత్తం వ్యాపించాయి. రాత్రి 2.40 గంటల ప్రాంతంలో అగ్నిమాపక శకటం మంటలు ఆర్పేసింది. అందరూ దిగేసి ఉంటారని భావించిన డ్రైవర్‌ సమీపంలో సేదదీరగా, ప్రయాణికులు వేర్వేరు వాహనాల్లో గమ్య స్థానాలకు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం పోలీసులు బస్సును పరిశీలించే క్రమంలో కాలిబూడిదైన వ్యక్తి తాలూకు ఎముకల గూడును గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది వరకు ఉన్నారని, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి గాఢ నిద్రలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేక మృత్యువాత పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలానా బస్సులో ఇంటికి వస్తానంటూ ఆదివారం రాత్రి ఒంగోలులోని స్నేహితుడికి సమాచారం ఇచ్చిన ఓ యువకుడు ఆ ప్రకారం రాకపోవడం, ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుసుకుని సోమవారం రాత్రి నల్గొండకు వచ్చి మృతదేహం ఆనవాళ్లు పరిశీలించారు. ‘మృతుడు తమ సంబంధికుడిగా వారు నిర్ధారించలేదు. దీంతో మరణించిన వ్యక్తి ఎవరనేది తేలలేదు’ అని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని