రూ.4.35 కోట్ల విలువైన నకిలీ మందుల స్వాధీనం

క్యాన్సర్‌ నివారణకు ఉపయోగించే నకిలీ మందులను భారీ పరిమాణంలో తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 06 Dec 2023 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ నివారణకు ఉపయోగించే నకిలీ మందులను భారీ పరిమాణంలో తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మచ్చ బొల్లారంలో దాడులు చేసి రూ.4.35 కోట్ల విలువైన తయారీ నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్టిక్రా హెల్త్‌కేర్‌ అనే కంపెనీ క్యాన్సర్‌ నివారణకు ఉపయోగించే మందులను నకిలీ, కల్తీ రూపంలో తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. విజిలెన్స్‌ బృందం కీసరలోని ఆస్టిక్రా సంస్థపై దాడులు నిర్వహించి, మచ్చ బొల్లారం వద్ద మూడు చోట్ల నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.4.35 కోట్ల విలువైన 36 రకాల క్యాన్సర్‌ నివారణ మందులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కె.సతీష్‌రెడ్డి పరారీ అయినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.రాము నేతృత్వంలో డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు జి.శ్రీకాంత్‌, కె.అన్వేష్‌, ఎం.చంద్రశేఖర్‌, వి.అజయ్‌, ఎస్‌.వినయ్‌ సుష్మీల ఆధ్వర్యంలో దాడులు జరిగాయని ఈ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని