జొన్న మూటల కింద నలిగిన ప్రాణాలు

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకకు చెందిన విజయపుర పట్టణంలో ఘోర దుర్ఘటన గుండెలను పిండేసింది.

Updated : 06 Dec 2023 06:26 IST

ఏడు మృతదేహాల వెలికితీత
కర్ణాటకలోని విజయపురలో దుర్ఘటన

విజయపుర, న్యూస్‌టుడే: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకకు చెందిన విజయపుర పట్టణంలో ఘోర దుర్ఘటన గుండెలను పిండేసింది. పట్టణ శివారులోని రాజగురు పరిశ్రమ గోదాములో జొన్న మూటలు దొర్లి.. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. మూటల కింద పదకొండు మంది చిక్కుకోగా సోమవారం రాత్రే నలుగురిని బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక, పోలీసు శాఖ, విపత్తు నిర్వహణ దళం సహాయక చర్యలు చేపట్టాయి.

మృతులను బిహార్‌కు చెందిన రాజేశ్‌ ముఖియా (25), రామ్రిజ్‌ ముఖియా (29), సంబూ ముఖియా (26), రామ్‌ బాలక్‌ (38), లోఖి జాధవ్‌ (56), కిశన్‌ కుమార్‌ (20), దాలనచంద ముఖియా (31)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారని, కొందరు రక్త సంబంధీకులని విజయపుర జిల్లాధికారి (డీసీ) టి.భూబాలన్‌ వెల్లడించారు. పరిశ్రమ యాజమాన్యంపై విజయపుర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ యజమాని కిశోర్‌ కుమార్‌ జైన్‌  మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. భారీ యంత్రం పక్కనే వందల మూటలు ఉండటంతో అవి ఒక్కసారిగా కుప్పకూలి ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని