వెంటాడిన పంటనష్టం.. అన్నదాత ఆత్మహత్య

కుమార్తె వివాహం కోసమని దాచి ఉంచిన బంగారు నగలు తాకట్టు పెట్టారు. పంట చేతికొస్తే అప్పు తీర్చి వాటిని తిరిగి తీసుకోవచ్చని ఆశపడ్డారు.

Updated : 06 Dec 2023 06:23 IST

కుమార్తె పెళ్లి నగలను తాకట్టు నుంచి విడిపించలేక మనస్తాపం

సంజామల, న్యూస్‌టుడే: కుమార్తె వివాహం కోసమని దాచి ఉంచిన బంగారు నగలు తాకట్టు పెట్టారు. పంట చేతికొస్తే అప్పు తీర్చి వాటిని తిరిగి తీసుకోవచ్చని ఆశపడ్డారు. కానీ పంటకు చీడపీడలు ఆశించడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన ఆ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా సంజామల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రతాప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్వకొండ గ్రామానికి చెందిన కొత్తమిద్దె రామకృష్ణుడు(40) లక్ష్మీదేవి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. కుమార్తె నగల్ని రెండేళ్ల క్రితం ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం నిశ్చయమైంది.

మూడెకరాల్లో తాను సాగు చేసిన మిరపపంట చేతికొస్తే అప్పులు తీర్చి నగలు తీసుకోవచ్చని రామకృష్ణుడు అనుకున్నారు. కానీ పంటను చీడపీడలు ఆశించడంతో పూర్తిగా నష్టపోయారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 2న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం గ్రామం వెలుపల ఓ బావిలో ఆయన మృతదేహం కనిపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని