పోలీసులు కొట్టారని..పెట్రోల్‌ పోసుకున్నాడు

సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

Published : 07 Dec 2023 04:39 IST

యర్రగొండపాలెం స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యాయత్నం
హుటాహుటిన వైద్యశాలకు తరలించిన పోలీసులు

యర్రగొండపాలెం, మార్కాపురం నేరవిభాగం, న్యూస్‌టుడే: సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. బాధితుడు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. యర్రగొండపాలెంలోని గాయత్రి సినిమాహాలు సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసముంటోంది. వారి కుమారుడు మోజేష్‌ (19) దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవ పడ్డారు. పోలీసులు వెళ్లి, ఆ సమయంలో అక్కడున్న మోజేష్‌, సుభాని అనే యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. మోజేష్‌ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపించిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటంతో మోజేష్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్టేషన్‌ ఆవరణలోనే బుధవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్‌ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో పడ్డాడు. ఎస్సై రాజేష్‌, సిబ్బంది హుటాహుటిన అతణ్ని మార్కాపురం వైద్యశాలకు తరలించారు.

పరిస్థితి విషమం

మోజేష్‌ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు తెలిపారు.   అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు  తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెడికో లీగల్‌ కేసు కట్టకుండా వైద్యం చేయలేమని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ ముందు జాతీయ రహదారిపై రాత్రి వేళ బైఠాయించి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు