పీఎఫ్‌ఐ కుట్ర కేసులో మూడో అభియోగ పత్రం

నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం మూడో అభియోగపత్రం దాఖలు చేసింది.

Published : 08 Dec 2023 04:49 IST

మహ్మద్‌ యూనస్‌ పాత్రను వెల్లడించిన ఎన్‌ఐఏ
ఇప్పటికే 16 మంది నిందితులపై అభియోగాలు

 ఈనాడు, హైదరాబాద్‌: నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం మూడో అభియోగపత్రం దాఖలు చేసింది. నిజామాబాద్‌ పీఎఫ్‌ఐ కుట్ర కేసులో 17వ నిందితుడు మహ్మద్‌ యూనస్‌పై హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కోర్టులో ఇది నమోదైంది. ఓ వర్గం యువతను పీఎఫ్‌ఐలో చేర్పించి వారికి సాయుధ శిక్షణ ఇచ్చి మరో వర్గంపై దాడులు చేయించడం ద్వారా దేశంలో మారణహోమం సృష్టించే కుట్రలో యూనస్‌ కీలకంగా వ్యవహరించాడని ఎన్‌ఐఏ అభియోగపత్రంలో పేర్కొంది. 2047 కల్లా దేశంలో ఇస్లామిక్‌ పాలనను స్థాపించాలనే లక్ష్యంతో పీఎఫ్‌ఐ కుట్రకు తెర లేపినట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. తొలుత నిజామాబాద్‌ నాలుగో పట్టణ పోలీసులు గతేడాది జూన్‌లో ఈ కేసును నమోదు చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఏకకాలంలో పలు రాష్ట్రాల్లో సుమారు వంద చోట్ల దాడులు చేసింది. దేశంలో మారణహోమం సృష్టించేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నుతున్నట్లు ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ గతేడాది సెప్టెంబరులో ఆ సంస్థపై నిషేధం విధించింది. మరోవైపు ఎన్‌ఐఏ ఈ కేసులో గతేడాది డిసెంబరులో 11 మందిపై తొలి అభియోగ పత్రం, గత మార్చిలో మరో అయిదుగురిపై రెండో అభియోగపత్రం దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని