డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్‌.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్‌ బాయ్‌ మృతి

నాలుగో అంతస్తులో లిఫ్ట్‌ కోసం గ్రిల్‌ డోర్‌ తెరిచారు. లిఫ్ట్‌ పైకి వచ్చిందని భావించి ఫోన్‌లో మాట్లాడుతూ లోనికి ప్రవేశించి లిఫ్ట్‌ పైభాగంలో పడిపోయారు. తర్వాత స్లాబ్‌కు తగిలి దుర్మరణం చెందారు.

Updated : 09 Dec 2023 06:57 IST

 రంగారెడ్డి జిల్లాలో విషాదం

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: నాలుగో అంతస్తులో లిఫ్ట్‌ కోసం గ్రిల్‌ డోర్‌ తెరిచారు. లిఫ్ట్‌ పైకి వచ్చిందని భావించి ఫోన్‌లో మాట్లాడుతూ లోనికి ప్రవేశించి లిఫ్ట్‌ పైభాగంలో పడిపోయారు. తర్వాత స్లాబ్‌కు తగిలి దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఠాణా పరిధిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మయూరీనగర్‌లో నివాసముంటున్న జేమ్స్‌(38) ఓ ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అశోక్‌నగర్‌లోని నివాస్‌ టవర్స్‌ అనే అపార్టుమెంటు నాలుగో అంతస్తులో ఇచ్చిన పార్సిల్‌ను వెనక్కి తీసుకోవడానికి వెళ్లారు. తిరిగి కిందకు వెళ్లేందుకు నాలుగో అంతస్తులోని లిఫ్ట్‌ గ్రిల్‌ డోర్‌ తెరిచారు. లిఫ్ట్‌ పైకి రాక కిందే ఉంది. ఫోన్‌ మాట్లాడుతూ ఇది గమనించని ఆయన లిఫ్ట్‌ లోపలికి వెళ్లేందుకని కాలు పెట్టారు. దీంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్‌ పై భాగంలో పడిపోయారు. వేరేవారు లిఫ్ట్‌ ఆన్‌చేసి పై అంతస్తులోకి వెళ్లారు. పైభాగంలో ఉన్న స్లాబ్‌ తగలడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మూడో అంతస్తులో ఆగిపోవడంతో మెకానిక్‌ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పై భాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య జరిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శుక్రవారం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని