NIA: ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలపై దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దూకుడు పెంచింది. పీఎఫ్‌ఐలో క్రియాశీలంగా వ్యవహరించిన వారిని పట్టుకోవడంలో నిమగ్నమైంది.

Updated : 17 Dec 2023 07:51 IST

తెలంగాణలో ఇద్దరు, ఏపీలో ఒకరిని పట్టిస్తే పారితోషికం
నిషేధిత పీఎఫ్‌ఐ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన ఎన్‌ఐఏ

ఈనాడు, హైదరాబాద్‌: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలపై దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) (National Investigation Agency) దూకుడు పెంచింది. పీఎఫ్‌ఐలో క్రియాశీలంగా వ్యవహరించిన వారిని పట్టుకోవడంలో నిమగ్నమైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరిని పట్టించిన వారికి పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ గురించి సమాచారం తెలిసినవారు వాట్సప్‌ నంబర్‌ 9497715294 కు తెలియజేయాలని ఎన్‌ఐఏ కోరింది. తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది.

పీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, కర్నూలు, నెల్లూరుల్లో దాడులు చేసి పలువురిని అరెస్టుచేశారు. అంతకుముందే నిజామాబాద్‌ పోలీసులు పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. ఆ కేసు ఆధారంగానే ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేయడం గమనార్హం. తాజాగా పీఎఫ్‌ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితోపాటు కేరళలో 11 మందిని.. కర్ణాటకలో అయిదుగురిని.. తమిళనాడులో అయిదుగురిని మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని