చెరువులు కబళించాయ్‌..!

సెలవు రోజు సరదాగా గడపాలనుకున్న ఆ బాలుర ఉత్సాహాన్ని మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు, మరోచోట మేకలకు కాపలాగా వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విషాదం నింపాయి.

Published : 12 Feb 2024 06:08 IST

రెండు సంఘటనల్లో నలుగురు బాలుర దుర్మరణం

తొర్రూరు, మల్హర్‌ - న్యూస్‌టుడే: సెలవు రోజు సరదాగా గడపాలనుకున్న ఆ బాలుర ఉత్సాహాన్ని మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు, మరోచోట మేకలకు కాపలాగా వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విషాదం నింపాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో గంధం యాకూబ్‌ (13), కిన్నెర జంపా (11) మరో నలుగురు స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న పెద్ద చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువు మత్తడి నుంచి పొలాలకు వెళ్లే కాలువలో ఈతకు దిగారు. వెంటనే యాకూబ్‌, జంపా మునిగిపోవడంతో మిగతా నలుగురు భయంతో ఒడ్డుపైకి చేరి కేకలు వేశారు. అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న గుంటుక నరేష్‌కు విషయం చెప్పి పారిపోయారు. నరేష్‌ సమీపంలో ఉన్న వారిని పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు.


అన్నదమ్ముల మృతి

మరో ఘటనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్ల పెంజేరువు గుంతలో పడి అన్నదమ్ములైన ఇద్దరు బాలురు మృతి చెందారు. కుటుంబసభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. బొంతల రాజు భార్య అనూష తన ఇద్దరు పిల్లలు అరుణ్‌కుమార్‌ (12), కార్తీక్‌ (9)లతో కలిసి మేకల కాపలాకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో అనూష ఆకలి వేస్తోందంటూ ఇంటికి వెళ్లింది. సాయంత్రం వేళ మేకల దగ్గర ఎవరూ లేరని గ్రామానికి చెందిన వ్యక్తులు.. బొంతల రాజుకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఆయన భార్యకు తెలపడంతో ఆమె హుటాహుటిన వెళ్లి తన పిల్లల కోసం వెతకగా.. చెరువు గుంత వద్ద చెప్పులు కనిపించాయి. గ్రామస్థులొచ్చి నీటిలో గాలించగా అరుణ్‌, కార్తీక్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరు మునిగిపోతుంటే మరొకరు రక్షించే ప్రయత్నంలో ఇద్దరూ మృతి చెంది ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని