Kakinada: నడిసంద్రంలో బోటు దగ్ధం

చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు మంటల్లో చిక్కుకుంది. బోటుకు అమర్చిన డీజిల్‌ ఇంజిన్‌ వేడెక్కి మంటలు చెలరేగడం, ఆ వెంటనే పేలడంతో అగ్నికీలలు బోటును చుట్టుముట్టాయి.

Updated : 13 Feb 2024 07:50 IST

ప్రాణాలతో బయటపడ్డ 11 మంది మత్స్యకారులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు మంటల్లో చిక్కుకుంది. బోటుకు అమర్చిన డీజిల్‌ ఇంజిన్‌ వేడెక్కి మంటలు చెలరేగడం, ఆ వెంటనే పేలడంతో అగ్నికీలలు బోటును చుట్టుముట్టాయి. అనూహ్య పరిణామానికి భీతిల్లిన మత్స్యకారులు సాయం కోసం కేకలు వేస్తూ సముద్రంలోకి దూకేశారు. సమీపంలోనే మరో బోటు ఉండటంతో దానిపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు చోటుచేసుకుంది. ఉప్పాడ గ్రామానికి చెందిన 11 మంది మత్స్యకారులు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బోటులో వేటకు వెళ్లారు. తీరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని రిలయన్స్‌కు చెందిన సిగ్నల్‌ స్తంభాల సమీపంలో చేపలు పడుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌ పేలిపోయి మంటలు వ్యాపించాయి. బోటు పూర్తిగా దగ్ధమైందని, వలలు పూర్తిగా కాలిపోయాయని మత్స్యకారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదంలో రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. బాధితులు మంగళవారం ఉదయానికి ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని