Hyderabad: వాహనాల స్మగ్లింగ్‌ విలువ రూ.100 కోట్లు!

ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాలు స్మగ్లింగ్‌ చేసిన కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ విస్మయకర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Updated : 22 Feb 2024 07:52 IST

ఇప్పటికే 98 ఎక్స్‌కవేటర్ల అక్రమ రవాణా
టాంజానియా మీదుగా జాంబియాకు తరలింపు
షిప్పింగ్‌ వివరాల కోసం మంబయి కస్టమ్స్‌కు సీసీఎస్‌ లేఖ

 ఈనాడు, హైదరాబాద్‌: ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాలు స్మగ్లింగ్‌ చేసిన కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ విస్మయకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల రుణాలతో కొనుగోలు చేసిన ఎక్స్‌కవేటర్‌ లాంటి భారీ వాహనాలను దొంగచాటుగా విదేశాలకు తరలించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన వాహనాలను దేశం దాటించినట్లు వెల్లడైంది. దీనిపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహారాష్ట్రలోని ముంబయి, పుణె, ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లతోపాటు టాంజానియా, జాంబియా మూలాలు బహిర్గతమయ్యాయి. ఇందులో రాయ్‌పుర్‌లోని జింక్‌సాల్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పుణెలోని విజిల్‌ ఇన్‌ఫ్రాతోపాటు ముంబయిలోని పలు కంపెనీల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ నిర్వాహకులు ఎక్కువ సంఖ్యలో వాహనాల స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సిద్ధ కన్‌స్ట్రక్షన్స్‌, క్రిసెంట్‌ ఇన్‌ఫ్రా, స్టాండర్డ్‌ ఎర్త్‌మూవర్స్‌.. తదితర కంపెనీలూ స్మగ్లింగ్‌ దందాలో ఉన్నట్లు తాజాగా గుర్తించారు.

జీఎస్టీ చెల్లించిందెవరు? షిప్పింగ్‌ చేసిందెవరు?

ఇప్పటివరకు గుర్తించిన నిందితులంతా పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులెవరో వెల్లడి కావాల్సి ఉందని సీసీఎస్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే వాహనాల తరలింపులో జీఎస్టీ చెల్లింపులతోపాటు నౌకాశ్రయాల ద్వారా షిప్పింగ్‌ వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమైంది. చాలా వరకు భారీవాహనాలను ముంబయి నౌకాశ్రయం నుంచి తొలుత టాంజానియాకు, అక్కడి నుంచి జాంబియాకు తరలించినట్లు గుర్తించారు. ఇందుకోసం ఒక్కో వాహనానికి రూ.15 లక్షల రవాణా ఖర్చు అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో జీఎస్టీ చెల్లించిందెవరు? షిప్పింగ్‌ చేసిందెవరనేది తెలిస్తే స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టవుతుందని దర్యాప్తు అధికారుల అంచనా. పన్ను చెల్లింపుల వివరాల కోసం జీఎస్టీ, షిప్పింగ్‌ వివరాల కోసం కస్టమ్స్‌ కార్యాలయాలకు సీసీఎస్‌ పోలీసులు లేఖలు రాశారు. అవసరమైతే ముంబయి నౌకాశ్రయానికి వెళ్లే యోచనలో ఉన్నారు.

343 మంది నిందితులు.. 299 మంది అరెస్టు

వాహనాల స్మగ్లింగ్‌ కేసుల్లో నిందితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తొలుత ఒక్క కేసుతో మొదలై ప్రస్తుతం ఆరు కేసులకు చేరింది. మొత్తం 98 భారీ వాహనాలను దేశం దాటించినట్లు బహిర్గతమైంది. ఒక్కో వాహనం సుమారు రూ.1.3 కోట్లుంటుందని, మొత్తం రూ.100 కోట్లకు పైగా విలువైన వాహనాలను అక్రమంగా తరలించారని అంచనా. ఆయా కేసుల్లో ఇప్పటివరకు 343 మంది ప్రమేయమున్నట్లు తేలగా.. 299 మందిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల్లో కొందరు యూకే తదితర విదేశాల్లోనూ ఉన్నట్లు తేలడంతో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని