Hyderabad: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్ష.. యువతిపై పోక్సో కేసు

తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది.

Updated : 23 Feb 2024 04:32 IST

ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది. హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, డీసీపీ కవిత, ఏసీపీ చాంద్‌బాషాలు గురువారం కేసు వివరాలు వెల్లడించారు.ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి(24) గ్రూప్‌-1 శిక్షణ కోసంహైదరాబాద్‌కు వచ్చింది. అశోక్‌నగర్‌లోని ఓ శిక్షణ సంస్థలో చేరిన ఆమె, అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పడింది. తాను ప్రేమిస్తున్న విషయాన్ని అధ్యాపకుడికి చెప్పగా.. తనకు భార్యాపిల్లలున్నారని చెబుతూ మందలించారు. ఆయనపై పగ పెంచుకున్న యువతి అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా, యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి అధ్యాపకుడి కుటుంబ చిత్రాలతోపాటు 11 ఏళ్ల ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసింది. అధ్యాపకుడు పనిచేసే శిక్షణ సంస్థ, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్‌ గ్రూపుల్లోనూ అశ్లీలతతో కూడిన పదజాలంతో ఆయా పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తూ వచ్చింది. ‘బాధితుడి ఫిర్యాదు మేరకు నగర సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు బృందం సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో గురువారం అరెస్టు చేసింది.  నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించాం’ అని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని