పురుగుల మందు తాగి.. ఆర్టిజన్‌ మృతి

చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు.. నమ్మినవాళ్లు మోసం చేశారన్న వేదనతో పురుగులమందు తాగిన ఆర్టిజన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

Published : 23 Feb 2024 03:28 IST

హాజీపూర్‌, న్యూస్‌టుడే: చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు.. నమ్మినవాళ్లు మోసం చేశారన్న వేదనతో పురుగులమందు తాగిన ఆర్టిజన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ ఎస్‌ఐ గోపతి సురేష్‌, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జైపూరు మండలం కుందారానికి చెందిన విజ్జగిరి సమ్మయ్య(51) మంచిర్యాలలో నివాసం ఉంటూ హాజీపూర్‌ మండలం వేంపల్లిలోని విద్యుత్‌ ఉపకేంద్రంలో ఆర్టిజన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 20న ఉపకేంద్రంలోనే పురుగుల మందు తాగారు. కొంతసేపటికి గమనించిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమ్మయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ‘విద్యుత్‌ సంస్థలో పనిచేస్తుండటంతో బతుకులు భారమవుతున్నాయి. ఒకే సంస్థలో రెండు సర్వీస్‌ రూల్స్‌ ఉండటం చాలా బాధగా ఉంది. డిపార్టుమెంట్‌ అధికారులు అవహేళన చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపాలి. దీనికి నా చావే ఆఖరిది కావాలని వేడుకుంటున్నాను’ అని రాసిన నోట్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు లభ్యమైంది. అందులో తన పిల్లలనుద్దేశించి ‘అమ్మ జాగ్రత్త’ అని రాసి ఉంది. ‘నమ్మినవాళ్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాను’ అని కూడా నోట్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని