గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్‌ షణ్ముఖ్‌

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయితో పట్టుబడ్డాడు. నగర శివారు పుప్పాలగూడలోని అతని నివాసంలో నార్సింగి పోలీసులు గురువారం 18 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Updated : 23 Feb 2024 07:02 IST

18 గ్రాములు స్వాధీనం చేసుకున్న నార్సింగి పోలీసులు
తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్‌ అన్నపై యువతి ఫిర్యాదు
అతణ్ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా గంజాయి లభ్యం

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నార్సింగి: యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయితో పట్టుబడ్డాడు. నగర శివారు పుప్పాలగూడలోని అతని నివాసంలో నార్సింగి పోలీసులు గురువారం 18 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి నివాసానికి వెళ్లారు. సంపత్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో షణ్ముఖ్‌ దగ్గర గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన సంపత్‌ వినయ్‌ (31) యూట్యూబ్‌ వీడియోలు చేస్తుంటాడు. మరో యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌కు సంపత్‌ సోదరుడు. ఇద్దరూ పుప్పాలగూడలో ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలైన యువతితో షణ్ముఖ్‌ జశ్వంత్‌కు పరిచయముంది. అతడి ద్వారా 2015లో ఆమెకు సంపత్‌ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. నిశ్చితార్థం జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. యువతి తల్లి అనారోగ్యం బారినపడడంతో వాయిదా వేశారు. మళ్లీ ఈ ఫిబ్రవరి 24న పెళ్లి తేదీ నిర్ణయించారు. తర్వాత వివిధ కారణాలతో సంపత్‌ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఈ నెల 27న మరో యువతితో సంపత్‌కు వివాహం చేస్తున్నామని అతడి తల్లిదండ్రులు యువతికి తెలిపారు. తనను మోసం చేసినట్లు గుర్తించిన యువతి గురువారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో షణ్ముఖ్‌ దగ్గర 18 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఇద్దరిపైనా వేర్వేరు కేసులు నమోదు చేశారు. సంపత్‌ను రిమాండుకు తరలించారు. షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు గంజాయి వినియోగిస్తున్నాడా లేదా అని తేల్చేందుకు వైద్యపరీక్షలు చేయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు