‘గొర్రెల’ గోల్‌మాల్‌లో ఇంటి దొంగలు

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధకశాఖ గురువారం అరెస్ట్‌ చేసింది.

Published : 23 Feb 2024 05:20 IST

 కాంట్రాక్టర్లతో ప్రభుత్వాధికారుల కుమ్మక్కు
రూ. 2.01 కోట్లు మోసపోయిన సరఫరాదారులు
నలుగురు జిల్లా స్థాయి అధికారుల్ని అరెస్ట్‌ చేసిన అనిశా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధకశాఖ గురువారం అరెస్ట్‌ చేసింది. కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్‌ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్‌ను అనిశా అధికారులు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి మార్చి 7 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులుగా గుర్తించిన మొయినుద్దీన్‌, అతని కుమారుడు ఇక్రమ్‌ పరారీలో ఉన్నారు. నిందితుల సంఖ్య 6కు చేరింది.

గొర్రెల పెంపకందారులది పల్నాడు జిల్లా

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకాన్ని నాడు ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టింది. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులకు వేరే శాఖల వారిని కూడా సర్కారు జతచేసింది. అనిశా దర్యాప్తు క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి మోసానికి తెరలేపిన వైనం బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలంటూ వారు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరా దారులను సంప్రదించారు. పశువైద్యశాఖ అధికారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్‌, ఇక్రమ్‌ కలిసి 133 మంది లబ్ధిదారుల్ని వెంట తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్‌కు రూ.1.58లక్షలను సరఫరా దారులకు  చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. అనంతరం అధికారుల సమక్షంలోనే లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు. వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేస్తామని అధికారులు సరఫరాదారులకు  హామీ ఇచ్చారు. తెలంగాణకు గొర్రెలను తీసుకొచ్చిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కుట్రకు తెర లేపారు. అసలు పెంపకందారుల స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్‌, స్నేహితులు, పనిమనుషులనే సరఫరాదారులుగా చూపుతూ రికార్డులను ఏమార్చారు. అధికారులు సహకరించి బినామీలనే అసలైన సరఫరాదారులుగా పేర్కొంటూ సంతకాలు చేశారు. దీంతో బినామీల పేరిటే నుంచి చెక్కులు మంజూరయ్యాయి. అనంతరం బినామీల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన కొద్దిరోజులకే వాటిని తిరిగి మొయినుద్దీన్‌, ఇక్రమ్‌ తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మోసంలో నలుగురు అధికారుల పాత్ర బహిర్గతం కావడంతో తాజాగా వారిని అరెస్ట్‌ చేశారు.

బైక్‌పై గొర్రెల తరలింపుపై ఆరా

గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టిన తీరును గతవారం వెలువడిన కాగ్‌ తాజా నివేదిక ఎత్తిచూపింది. ఒక బైక్‌పై ఏకంగా 126 గొర్రెల్ని తీసుకొచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించిన అంశాన్ని కాగ్‌ బహిర్గతం చేసింది. అలాగే ఆటోలు, బస్సులు, కార్లలోనూ గొర్రెల్ని తరలించినట్లు చూపి నిధుల్ని స్వాహా చేసినట్లు నిగ్గుతేల్చింది. తాజా దర్యాప్తు నేపథ్యంలో కాగ్‌ నివేదికలోని అంశాలనూ అనిశా లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు