ఐటీ అధికారులమంటూ దారి దోపిడీ

‘ఆదాయ పన్ను శాఖ అధికారులం. మీ కారును తనిఖీ చేయాలి’ అంటూ నగల వ్యాపారి వద్దనున్న మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో ఐదుగురు దుండగులు పరారయ్యారు.

Published : 23 Feb 2024 03:49 IST

3.5 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారీ

గోపాలపురం, నల్లజర్ల, న్యూస్‌టుడే: ‘ఆదాయ పన్ను శాఖ అధికారులం. మీ కారును తనిఖీ చేయాలి’ అంటూ నగల వ్యాపారి వద్దనున్న మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో ఐదుగురు దుండగులు పరారయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులో బుధవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం.. మహారాష్ట్ర నుంచి పాతికేళ్ల కిందట వలసవచ్చి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడిన గార్లె బాలు నాధూరాం బంగారం వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహా పలు ప్రాంతాల్లోని దుకాణాల్లో హోల్‌సేల్‌ ధరలకు బంగారం విక్రయిస్తుంటారు. బుధవారం భీమవరం నుంచి కారులో డ్రైవరుతో పాటు బయల్దేరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక దుకాణంలో బంగారం ఇచ్చి కొయ్యలగూడెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. నల్లజర్ల మండలం పోతవరం శివారుకు వచ్చేసరికి కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. తాము ఐటీ విభాగం అధికారులమంటూ వ్యాపారి కారును అడ్డగించారు. వ్యాపారిని, డ్రైవరును తమ కారులో ఎక్కించుకొని, నాదూరాం కారును ఆ ఐదుగురిలో ఒకరు నడిపారు. వీరు జాతీయ రహదారిపై కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌ వరకు వచ్చారు. అక్కడ రాత్రి 9 గంటల సమయంలో వ్యాపారిని, డ్రైవరును విడిచిపెట్టి, దుండగులు తాము వచ్చిన వాహనంలో వెళ్లిపోయారు. వ్యాపారి తన కారును తనిఖీ చేయగా బంగారం, నగదు లేదు. వచ్చింది నకిలీ అధికారులని గుర్తించి తొలుత కొయ్యలగూడెం పోలీసు స్టేషన్‌లో, తర్వాత నల్లజర్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు