పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనుల హత్య

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా దుల్లేడ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్లనే నెపంతో శుక్రవారం తెల్లవారుజామున మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

Published : 24 Feb 2024 04:33 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా దుల్లేడ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్లనే నెపంతో శుక్రవారం తెల్లవారుజామున మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సోడి ఉంగా(35), మద్వి నందా(32)లను గురువారం కొందరు మావోయిస్టులు అపహరించారు. అనంతరం వందల మంది ఆదివాసీలతో ప్రజాకోర్టు ఏర్పాటు చేసి వీరిద్దరిపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు పోలీసులతో కలిసి పని చేస్తున్నారని నిందించారు. అనంతరం ఇద్దరినీ నరికి హత్య చేశారు. వారి మృతదేహాలను గ్రామ శివారులో పడేసి.. హెచ్చరికలతో కూడిన కరపత్రాలను వదిలివెళ్లారు. అనంతరం సోడి ఉంగా, మద్వి నందాలను ప్రజాకోర్టులో శిక్షించామని సీపీఐ మావోయిస్టు పామేడు ఏరియా కమిటీ పేరున ఒక ప్రకటన విడుదల చేశారు. వీరికి మరణశిక్ష విధించాలని ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించడంతో పీఎల్‌జీఏ అమలు చేసిందని తెలిపారు. వీరి మృతికి రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వ పాలనే కారణమని పేర్కొన్నారు.

ఇద్దరు మహిళా మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపుర్‌ జిల్లా మద్దేడ్‌ పోలీసుస్టేషన్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టు మిలీషియా సభ్యులను గురువారం రాత్రి అరెస్టు చేశారు. లోడెడ్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న బలగాలు అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరిత, టింగేమీనాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. వీరు మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పని చేయడంతోపాటు 2010 మే 26న లోడెడ్‌ గ్రామంలో ఒకరిని, 2010 జులై 21న సంగంపల్లికి చెందిన మరొకరిని అపహరించి హత్య చేసిన సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు విచారణలో గుర్తించారు. దీంతో అరెస్టు చేసి బిజాపుర్‌ జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని