బన్‌భూల్‌పురా అల్లర్ల బాధితులకు డబ్బుల పంపిణీ

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం బన్‌భూల్‌పురాలో అల్లర్ల బాధితులకు డబ్బు పంపిణీ వ్యవహారంలో హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థపై నైనిటాల్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Published : 24 Feb 2024 04:33 IST

హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థపై నైనిటాల్‌ పోలీసుల ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం బన్‌భూల్‌పురాలో అల్లర్ల బాధితులకు డబ్బు పంపిణీ వ్యవహారంలో హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థపై నైనిటాల్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఈనెల 20న బన్‌భూల్‌పురాలో రూ.100, రూ.200 నోట్లను విరివిగా పంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. అతడిని హైదరాబాదీగా గుర్తించిన నైనిటాల్‌ పోలీసులు అక్కడికి పిలిచి విచారించారు. తాను హైదరాబాద్‌లో చట్టప్రకారమే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తానని వెల్లడించడంతో శుక్రవారం విడుదల చేశారు. అయితే హైదరాబాద్‌లోని ఆ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాల గురించి ఆరా తీయడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆదాయపన్ను శాఖ నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఈనెల 8న బన్‌భూల్‌పురాలో జరిగిన అల్లర్లలో అయిదుగురు చనిపోవడంతోపాటు 150 మంది వరకు గాయపడ్డారు. అక్కడి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో మున్సిపల్‌ సిబ్బందిపై స్థానికులు దాడిచేశారు. అప్పుడు చోటుచేసుకున్న అల్లర్లు హింసాత్మకంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని