యాచకుణ్ని కాలితో తన్నిన డీటీ... టిప్పర్‌ కింద పడి దుర్మరణం

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

Updated : 24 Feb 2024 06:48 IST

సీసీ ఫుటేజీతో వెలుగులోకి

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ కారులో ఆర్మూర్‌ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్‌ లేవని బదులిచ్చారు. గ్రీన్‌ సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్‌ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్‌ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని