అతి వేగం.. అజాగ్రత్త!

మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ఠాత్మకంగా.. అత్యాధునికంగా నిర్మించిన హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతోంది.

Updated : 24 Feb 2024 05:00 IST

ఓఆర్‌ఆర్‌పై హడలెత్తిస్తున్న ప్రమాదాలు
ఏడాదిలో 127 శాతం పెరుగుదల
‘వరుస’ మారుతున్న ప్రయాణాలతోనూ ముప్పు

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ఠాత్మకంగా.. అత్యాధునికంగా నిర్మించిన హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతోంది. అత్యంత వేగంగా వెళ్లేందుకు అనువైన ఈ రహదారిపై రయ్‌న దూసుకొస్తున్న వాహనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెప్పపాటులో మరణాలు సంభవిస్తున్నాయి. అంతకుముందు ఏడాది కంటే 2023లో ప్రమాదాలు 127 శాతం పెరిగాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం నేపథ్యంలో ఇప్పుడు మరోమారు ఓఆర్‌ఆర్‌ ప్రమాదాలపై చర్చ మొదలైంది.

రోజూ 1.5 లక్షల వాహనాల రాకపోకలు..

హైదరాబాద్‌ చుట్టూ 158 కి.మీ.ల పొడవునా నిర్మించిన ఓఆర్‌ఆర్‌ యావత్‌ రాష్ట్రానికే తలమానికం. 8 వరుసల్లో నిర్మించిన ఈ రహదారిపై రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వాహనాలు 120 కి.మీ.ల వేగంతో ప్రయాణించవచ్చు. ప్రతిరోజూ దాదాపు 1.5 లక్షల వాహనాలు దీనిపై రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యాధునికంగా నిర్మించిన ఈ రోడ్డుపై పలువురు అతివేగంగా.. అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రాణం తీస్తున్న వేగం

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగం. ఇక్కడ గరిష్ఠంగా 120 కి.మీ.ల వేగంతో వెళ్లవచ్చు. అయితే చాలా వాహనాలు ఏకంగా 140-160 కి.మీ.ల వేగంతో వెళుతున్నాయని పోలీసులే చెబుతున్నారు. అత్యధికంగా 200 కి.మీ.ల వేగంతో వెళ్లిన వాహనాన్నీ గుర్తించినట్లు తెలిపారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలపై కనీసం రోజుకు అధిక సంఖ్యలో కేసులు రాస్తున్నట్లు వెల్లడించారు. ఇంత వేగంతో వాహనం వెళుతున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితిలో అదుపు చేయడం కష్టమవుతుంది. శుక్రవారం లాస్య నందిత మరణానికి కూడా అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. 2022లో ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది మరణించగా 2023 నాటికి ఆ సంఖ్య 216కి పెరిగింది.

ఇతర కారణాలు..

  • ఓఆర్‌ఆర్‌ నిర్మాణ సమయంలో పలువురు రాజకీయ నాయకుల భూముల పరిరక్షణ కోసం ఏకంగా దాదాపు వందసార్లు అలైన్‌మెంట్‌ను మార్చారు. ఫలితంగా ఈ రోడ్డు అనేక వంపులతో నిర్మితమైంది. ఈ వంపుల దగ్గర వాహనదారులు తాము నడుపుతున్న వాహనాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో పక్కనున్న రైలింగ్‌ను ఢీకొడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
  • ఓఆర్‌ఆర్‌లో ఒకవైపు 4, మరోవైపు 4 వరుసలున్నాయి. ఒకవైపు మొదటి రెండు వరుసల్లో 120 కి.మీ.ల వేగంతో ప్రయాణించే వీలుంది. మిగిలిన 2 వరుసల్లో వాహనవేగం పరిమితి 80 కి.మీ.లు. ఈ లేన్ల గందరగోళంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 120 కి.మీ.ల వేగంతో వెళ్లే వాహనాలు ఒక్కోసారి పక్కనే ఉన్న 80 కి.మీ.ల లేన్‌లోకి దూసుకొస్తుండటంతో అక్కడున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. కొందరు వాహనదారులు అవగాహన లేకుండా ఒక్కసారిగా 80 కి.మీ.ల లేన్‌ నుంచి 120 కి.మీ.ల లేన్‌లోకి వెళుతుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
  • ఓఆర్‌ఆర్‌పై లారీలు 80 కి.మీ.ల లేన్‌లోనే వెళ్లాలి. కొందరు డ్రైవర్లు 120 కి.మీ.ల లేన్‌లోకి వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు వేగంగా వెళ్లే లారీని అకస్మాత్తుగా నిలుపుతుండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఓఆర్‌ఆర్‌లో వెళుతున్న కొందరు   వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిచోట్ల సర్వీస్‌ రోడ్డు నుంచి ఓఆర్‌ఆర్‌లోకి వచ్చేటప్పుడు వాహనాల సిగ్నల్‌ వ్యవస్థను ఉపయోగించకుండా దూసుకురావడంతో కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు. నడిపేవారి నిద్రలేమి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • ఓఆర్‌ఆర్‌పై చెట్ల నరికివేత ఇతరత్రా పనులు చేసేటప్పుడు తగిన హెచ్చరిక వ్యవస్థలను కూడా వినియోగించడం లేదు. అదే సమయంలో రోడ్డుపక్కన సిబ్బంది వాహనాలను నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని