అమరేశ్వరాలయంలో చోరీ

పంచారామాల్లో ప్రథమ ఆరామంగా వెలుగొందుతున్న పల్నాడు జిల్లా అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

Published : 24 Feb 2024 06:41 IST

హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దొంగ

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామాల్లో ప్రథమ ఆరామంగా వెలుగొందుతున్న పల్నాడు జిల్లా అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఓ ఆగంతకుడు బాలచాముండికా అమ్మవారి ఆలయం ముందున్న హుండీ పగలగొట్టి అందులోని నగదు దోచుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి సమయంలో ఆలయానికి ఉత్తర దిక్కున కృష్ణా నది వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి గోడదూకి ఆలయంలోని ధ్వజస్తంభం ముందున్న ప్రధాన ద్వారం ఇనుప గేటు వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గడ్డపారతో గేటు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. హుండీని గడ్డపారతో పగలగొట్టి అందులోని నగదు అపహరించుకుని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన అర్చకులు గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఈఓ గోపికి సమాచారం ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తి చొరబడినట్లు గుర్తించారు. క్లూస్‌టీ రంగంలోకి దిగి ప్రాథమిక ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ బ్రహ్మం తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్లు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డిసెంబరు 16 తర్వాత భక్తులు హుండీలో వేసిన నగదు అపహరణకు గురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని