కామారెడ్డి పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది.

Updated : 25 Feb 2024 06:28 IST

కామారెడ్డి నేరవిభాగం-న్యూస్‌టుడే, ఈనాడు-హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలోని కంప్యూటర్లు, యూపీఎస్‌లు, ప్రింటర్లు, రూటర్లు, టేబుళ్లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, కుర్చీలు తదితర సామగ్రి కాలి బూడిదయింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు. పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రానికి ఆనుకునే ఉన్న తపాలా కార్యాలయానికి మంటలు వ్యాపించకుండా నిరోధించడంతో భారీ నష్టం తప్పింది. కామారెడ్డిలోని పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రం సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి ఈ కేంద్రంలో సేవలు పొందాల్సి ఉన్న దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారందరికీ నిజామాబాద్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమ అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్‌ చేసుకోవాలనుకునేవారు ఏ పాస్‌పోర్టు సేవాకేంద్రానికైౖనా లేదా పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రానికైనా మార్చుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు దరఖాస్తుదారులు rpo.hyderabad@mea.gov.in ను సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని