ప్రాణాలు తీసిన వానరాల గుంపు

పంటకు కాపలాగా వెళ్లిన యువ రైతును వానరాలు వెంబడించగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 25 Feb 2024 04:24 IST

పంట కాపలాకు వెళ్లిన యువరైతును వెంబడించగా గాయపడి మృతి

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: పంటకు కాపలాగా వెళ్లిన యువ రైతును వానరాలు వెంబడించగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కాడిగొల్ల సునిల్‌(30) తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్నకు కోతుల బెడద ఎక్కువైంది. ఈ నెల 17న కాపలాగా వెళ్లిన సునిల్‌ను అక్కడ ఉన్న వానరాల గుంపు వెంబడించింది. తప్పించుకోవడానికి పరిగెత్తుతూ చిన్నపాటి సాగునీటి కాలువపై నుంచి దూకే యత్నంలో అదుపుతప్పి అందులో పడిపోయారు. తలకు గాయాలయ్యాయి. స్థానికంగా వైద్య చికిత్స చేయించుకున్నారు.  కొంచెం కోలుకోవడంతో ఈ నెల 21న మళ్లీ పొలానికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్నారు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా తలకు బలమైన దెబ్బలు తగిలాయని గుర్తించి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. రెండు రోజులు ఐసీయూలో ఉన్న యువకుడు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. వైద్యం కోసం కుటుంబసభ్యులు రూ.8 లక్షల వరకు వెచ్చించారు. అయినా ప్రాణాలు కాపాడుకోలేక పోయామని తల్లి నర్సవ్వ, భార్య మనూష రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని