నమ్మి ఆశ్రయిస్తే నకిలీ హాల్‌టికెట్‌ ఇచ్చాడు!

బద్ధకం.. కాలయాపన.. ఆపై నిర్లక్ష్యం.. నిర్భయం.. ఇవన్నీ ఒంటబట్టించుకున్న ఓ యువకుడు తను కటకటాల పాలవడమే కాకుండా తన బంధువును కష్టాల్లోకి నెట్టేశాడు.

Published : 28 Feb 2024 06:23 IST

నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: బద్ధకం.. కాలయాపన.. ఆపై నిర్లక్ష్యం.. నిర్భయం.. ఇవన్నీ ఒంటబట్టించుకున్న ఓ యువకుడు తను కటకటాల పాలవడమే కాకుండా తన బంధువును కష్టాల్లోకి నెట్టేశాడు. చిత్తూరు జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షకు నకిలీ హాల్‌ టికెట్‌ తయారు చేసిన నిందితుడి వ్యవహారమిది. ఏఎస్పీ  ఆరీఫుల్లా మంగళవారం ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన సుదర్శన్‌ గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసిపెట్టమని డోన్‌లో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న తన సమీప బంధువైన ఇమ్మానుయేల్‌ను ఆశ్రయించాడు. నగదు ఇచ్చి వివరాలు చెప్పి, దరఖాస్తు చేసి హాల్‌టికెట్‌ వచ్చాక పంపమని వెళ్లిపోయాడు. ఇమ్మానుయేల్‌ దరఖాస్తు చేయకుండా కాలయాపన చేశాడు.

పరీక్ష తేదీ సమీపించడంతో సుదర్శన్‌ ఇమ్మానుయేల్‌ను హాల్‌టికెట్‌ గురించి అడిగాడు. దరఖాస్తు పెట్టలేదని చెబితే గొడవవుతుందని భయపడ్డ ఇమ్మానుయేల్‌ నకిలీ హాల్‌టికెట్‌ తయారీకి సిద్ధపడ్డాడు. పరీక్ష కేంద్రం దూర ప్రాంతంలో పడినట్లు పెడితే.. సుదర్శన్‌ అక్కడకు వెళ్లలేడు కనుక సమస్య ఉండదని భావించాడు. అదే సమయంలో ఓ యువకుడు తన మీ-సేవ కేంద్రంలో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వెళ్లగా, దాని కాపీ దాచిపెట్టి సుదర్శన్‌ వివరాలతో ‘ఎడిట్‌’ చేశాడు. పరీక్ష కేంద్రం కర్నూలుకు దూరంగా ఉండే చిత్తూరు నగరంగా మార్చి, హాల్‌టికెట్‌ ‘తయారుచేసి’ సుదర్శన్‌కు ఇచ్చాడు. అతడు ఆదివారం ఆదరాబాదరాగా చిత్తూరు చేరుకుని పరీక్ష కేంద్రం కోసం అధికారులను ఆశ్రయించగా హాల్‌టికెట్‌ నకిలీదని గుర్తించి పోలీసులకు తెలిపారు. వారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పిన వివరాలతో ఇమ్మానుయేల్‌ నిర్వాకాన్ని గుర్తించి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని