ఆకాశ్‌-బైజూస్‌ అకాడమీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ నగరం గాజువాకలోని ప్రధాన రహదారిలో సినిమా హాలు కూడలి వద్దనున్న ఓ వాణిజ్య భవన సముదాయంలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 28 Feb 2024 05:15 IST

ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

గాజువాక, న్యూస్‌టుడే: విశాఖ నగరం గాజువాకలోని ప్రధాన రహదారిలో సినిమా హాలు కూడలి వద్దనున్న ఓ వాణిజ్య భవన సముదాయంలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు, మంటల ధాటికి అయిదంతస్తుల భవనంలోని రెండంతస్తులు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మొదటి మూడు అంతస్తుల్లో వైభవ్‌ జ్యూయలరీ దుకాణాలు, పైరెండు అంతస్తుల్లో ఆకాశ్‌-బైజూస్‌ అకాడమీ విద్యా సంస్థలున్నాయి. తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో ఆకాశ్‌-బైజూస్‌ అకాడమీ నుంచి పొగలు, మంటలు రావడం చూసిన స్థానికులు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది.. జిల్లా అగ్నిమాపక కేంద్రం నుంచి 90 మీటర్ల ఎత్తయిన స్కైలిఫ్ట్‌ యంత్రంతో పాటు మొత్తం 8 శకటాలను తీసుకొచ్చారు. ఆరుగంటల పాటు శ్రమించి ఉదయం 11.30 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎత్తయిన భవనానికి ఇరువైపులా దారిలేని పరిస్థితి వల్ల మంటలను అదుపు చేయడం మొదట కష్టమైంది. ప్రమాదంలో అకాడమీలోని కంప్యూటర్లు, ఏసీ యూనిట్లు తదితర సామగ్రి కాలిపోయాయి. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని