దండకారణ్యంలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్య ప్రాంతం మంగళవారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది.

Published : 28 Feb 2024 05:03 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్య ప్రాంతం మంగళవారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బడే తుంగలి, ఛోటే తుంగలి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో రెండు దళాలకు చెందిన మావోయిస్టు నాయకులు ప్రశాంత్‌, అనిల్‌ పునెమ్‌.. 40-50 మందితో సమావేశం నిర్వహించనున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో భద్రతా బలగాలు సోమవారం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించాయి. పోలీసులు రెండు బృందాలుగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. పసిగట్టిన మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో రెండు చోట్లా డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య రెండు గంటలసేపు కాల్పులు చోటుచేసుకున్నాయి. కొందరు మావోయిస్టులు తప్పించుకుపోయారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలించగా.. కొద్ది దూరంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటన స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన తుపాకులు, పేలుడు పదార్థాలు, కిట్‌ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

‘మొన్నటి మృతులు మావోయిస్టులు కాదు.. రైతులు’

కంకెర్‌: రెండు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు మావోయిస్టులు కాదని, రైతులని వారి కుటుంబాలు ప్రకటించాయి. మృతులను మార్దా గ్రామానికి చెందిన రామేశ్వర్‌ నేగి, సురేష్‌, హిడ్కో పైర్వి గ్రామానికి చెందిన అనిల్‌ కుమార్‌గా గుర్తించారు. వారు పొలాల్లో పనిచేసుకునే రైతులని కుటుంబసభ్యులు చెబుతుండగా.. ఎస్పీ ఎలెసెల మాత్రం దీన్ని ఖండించారు. మావోయిస్టుల ఒత్తిడితోనే మృతుల కుటుంబ సభ్యులు అలా చెబుతున్నారని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఇందులో మావోయిస్టుల నాయకుడు రాజు సలాం, అతని దళం పాత్ర ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని