టీ కోసం వెళ్తే.. ప్రాణాలే పోయాయి..

అర్ధరాత్రి వేళ.. టీ తాగాలని బయలుదేరిన ఆ యువకులను మృత్యువు కబళించింది. ఆయిల్‌ ట్యాంకర్‌ రూపంలో దూసుకొచ్చి మూడు నిండు ప్రాణాలను బలిగొంది.

Published : 28 Feb 2024 05:16 IST

 ఆయిల్‌ ట్యాంకరు ఢీకొని ముగ్గురి మృతి
పరారయ్యే యత్నంలో ట్యాంకరూ బోల్తా.. డ్రైవరు మృత్యువాత

జోగిపేట, న్యూస్‌టుడే: అర్ధరాత్రి వేళ.. టీ తాగాలని బయలుదేరిన ఆ యువకులను మృత్యువు కబళించింది. ఆయిల్‌ ట్యాంకర్‌ రూపంలో దూసుకొచ్చి మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరో యువకుడిని ఆసుపత్రి పాలుజేసింది. తర్వాత ట్యాంకర్‌ డ్రైవర్‌ భయంతో మరింత వేగంగా నడపడంతో అది అదుపు తప్పి బోల్తా పడడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలోని మాసానిపల్లి శివారులో ఎన్‌హెచ్‌ 161 సర్వీసు రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణానికి చెందిన ముఖరం (26), హాజీ (26), వాజీద్‌ (29), రిజ్వాన్‌, అర్షద్‌, షంషు రాత్రివేళ టీ తాగేందుకు కారులో చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపైనున్న హోటల్‌కు వెళ్లారు. అది మూసి ఉండడంతో అదే మార్గంలో అందోలు మండలంలోని సంగుపేట శివారులో ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా డాకూరు దగ్గరున్న హోటల్‌కు బయలుదేరారు. దారిలో మాసానిపల్లి శివారులోని అండర్‌పాస్‌ వద్ద కారు నిలిపి.. ముఖరం, హాజీ, వాజీద్‌, రిజ్వాన్‌ మూత్రవిసర్జనకు కిందకు దిగారు. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వైపు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకరు అతివేగంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న నలుగురితోపాటు కారును ఢీకొంది. ప్రమాదంలో ముఖరం, హాజీ, వాజీద్‌ అక్కడికక్కడే మృతిచెందారు. రిజ్వాన్‌ను హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక భాగం నుజ్జయింది. అర్షద్‌, షంషు కారులోనే ఉన్నా.. ముందువైపు కూర్చోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. యువకులను ఢీకొట్టి వేగంగా వెళ్లిన ఆయిల్‌ ట్యాంకర్‌ అల్లాదుర్గం శివారులో బోల్తాపడడంతో దాని డ్రైవర్‌ కియారాం (25) మృతి చెందినట్లు ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపారు. ట్యాంకర్‌ను ఎవరైనా గుర్తిస్తారన్న భయంతో డ్రైవర్‌ వేగంగా పరారవ్వాలన్న ప్రయత్నంలో అదుపుతప్పి ఉండొచ్చని అన్నారు. కియారాంను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని