డ్రగ్స్‌ సరఫరాదారు అరెస్టు

హైదరాబాద్‌లోని రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలో సరఫరాదారు అబ్బాస్‌ అలీ జాఫ్రీని సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 28 Feb 2024 05:07 IST

వివేకానంద్‌కు రాడిసన్‌ హోటల్‌లో 10 సార్లు కొకైన్‌ అందించినట్లు గుర్తింపు
పరారీలో ఉన్న వారి కోసం పోలీసుల గాలింపు

ఈనాడు - హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలో సరఫరాదారు అబ్బాస్‌ అలీ జాఫ్రీని సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హోటల్‌ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పార్టీకి గతంలో ఎవరెవరు వెళ్లారు తదితర ఆధారాలు సేకరించేందుకు ఇబ్బందిగా మారింది.

వారిద్దరి మధ్య లావాదేవీల పరిశీలన

గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత మాదాపూర్‌ ఎస్‌వోటీ, గచ్చిబౌలి పోలీసులు సోదాలు చేసి మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌, నిర్భయ్‌, కేదార్‌నాథ్‌ను అరెస్టు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన క్రమంలో సినీ దర్శకుడు క్రిష్‌(జాగర్లమూడి రాధాకృష్ణ) పేరు వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌ ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్‌ హాజరైనట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. దర్శకుడి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామని.. ఫోన్‌లో సంప్రదించి విచారణకు రావాలని కోరామని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ మంగళవారం విలేకరులకు తెలియజేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని క్రిష్‌ బదులిచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహించాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్‌ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్‌ సరఫరాదారు అబ్బాస్‌ అలీ జాఫ్రీ గతంలో మంజీరా గ్రూపు సంస్థలో పనిచేశాడు. ఆ పరిచయంతోనే వివేకానంద్‌ డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నట్లు తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలను గుర్తించారు.

గతేడాది నుంచి..

పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసించే వివేకానంద్‌ గతేడాది నుంచి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అతడు అబ్బాస్‌ను సంప్రదించి నేరుగా రాడిసన్‌ హోటల్‌కు ప్రతిసారీ 4 గ్రాముల చొప్పున ఇప్పటివరకూ 10 సార్లు డ్రగ్స్‌ తెప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. గ్రాము కొకైన్‌ రూ.14 వేల చొప్పున అబ్బాస్‌ నుంచి కొనేవాడు. ఇతడు డ్రగ్స్‌ వినియోగించడంతోపాటు ఎవరికైనా విక్రయిస్తున్నాడా అనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని