మలుపులు తిరుగుతున్న డ్రగ్స్‌ కేసు.. విచారణకు దర్శకుడు క్రిష్‌

హైదరాబాద్‌లో రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది.

Updated : 29 Feb 2024 18:32 IST

తాజాగా వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ అరెస్టు

ఈనాడు- హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఫోన్‌ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈకేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. బుధవారం వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్‌ వివిధ మార్గాల్లో కొకైన్‌ తెచ్చి డ్రైవర్‌ ప్రవీణ్‌కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్‌.. వివేకానంద్‌కు అందిస్తున్నాడు. ప్రవీణ్‌, అబ్బాస్‌ల మధ్య నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్‌, సందీప్‌, నీల్‌, శ్వేత, యూట్యూబర్‌ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు.

డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల ప్రకారం.. వివేకానంద్‌ వారాంతాల్లో హోటల్‌కు వచ్చేవాడని, తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని వెల్లడైంది. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు భావించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రాడిసన్‌ హోటల్‌లో మొత్తం 200 కెమెరాలుండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌ తరచూ నిర్వహించే డ్రగ్స్‌ పార్టీలకు.. అతని స్నేహితులు సినీ, వ్యాపార  ప్రముఖులు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారనే సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని ఓ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని