కరీంనగర్‌లో భూ దందా.. మరో ముగ్గురు కార్పొరేటర్ల భర్తలపై కేసులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూ దందాకు సంబంధించి బుధవారం మరో ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలపై కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

Updated : 29 Feb 2024 06:03 IST

ఈనాడు, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూ దందాకు సంబంధించి బుధవారం మరో ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలపై కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లిలో తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి భారాస కార్పొరేటర్ల భర్తలైన ఎడ్ల అశోక్‌, కాశెట్టి శ్రీనివాస్‌, తులా బాలయ్యలు డబ్బులు డిమాండ్‌ చేశారని పలువురు బాధితులు ఇటీవల సీపీ అభిషేక్‌ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆ ప్లాట్లను శ్మశానవాటికకు ఉపయోగిస్తామని బెదిరించారని, ప్రహరీని కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీ ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐ ప్రదీప్‌ తెలిపారు. వారిని బుధవారం సాయంత్రం న్యాయస్థానంలో హాజరుపరిచారు. రిమాండ్‌ విధించాలన్న పోలీసుల వినతిని ప్రిన్సిపల్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు తోట రాములు, జంగిలి సాగర్‌ అరెస్టయి జైలుకు వెళ్లారు. కార్పొరేటర్ల భర్తలు కోల ప్రశాంత్‌, సుధగోని కృష్ణాగౌడ్‌లు జుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా మరో ముగ్గురిపై కేసులు నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని