మలుపులో ముగిసిన బతుకులు

కూలీలతో వెళ్తున్న ఆటోను మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 29 Feb 2024 03:48 IST

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఐదుగురు కూలీల దుర్మరణం
మరో ఆరుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
మరో ఘటనలో ముగ్గురి మృతి

కోదాడ గ్రామీణం, మోతె, న్యూస్‌టుడే: కూలీలతో వెళ్తున్న ఆటోను మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. మరో ఘటనలో వేగంగా వస్తున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా రెండు వాహనాల్లోని ముగ్గురు మృత్యువాతపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మిరప తోటల్లో పనుల కోసం మునగాల మండలం విజయరాఘవాపురం, రేపాల గ్రామాలకు చెందిన 12 మంది కూలీలు ఉదయం మోతె మండలం హుస్సేనాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డు మీదుగా వెళ్తూ.. కేశవాపురం వెళ్లే రహదారిని దాటేందుకు ఆటో డ్రైవర్‌ ప్రయత్నించాడు. అదే సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మధిర డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ దిగింది. అండర్‌పాస్‌ మీదుగా మోతె వైపు బస్సును మలుపుతిప్పే క్రమంలో డ్రైవర్‌ వేగంగా ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటో 10 మీటర్ల దూరంలోని పొలాల్లో ఎగిరిపడింది. కూలీలంతా ఎగిరి రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయారు. కందుల నాగమ్మ(60), చెవుల నారాయణమ్మ(55), పోకల అనసూయమ్మ(60) అక్కడికక్కడే మృతిచెందారు. రెమిడాల సౌభాగ్యమ్మ(70) సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, కందుల గురవయ్య(65) హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. సోమపంగు లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు కూలీలు స్వల్పంగా గాయపడ్డారని, ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ సత్యనారాయణరావును అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వెద్యం అందించాలని వైద్యులకు సూచించినట్టు చెప్పారు.

స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం వల్లనేనా?

మోతె వద్ద 365బీబీ జాతీయ రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్‌ దిగువ భాగంలో స్పీడ్‌బ్రేకర్లు నిర్మించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడంతో బస్సు డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేక ఆటోను ఢీకొట్టినట్లు వారు వెల్లడించారు.


ముగ్గురిని బలిగొన్న అతివేగం

నంగునూరు, న్యూస్‌టుడే: అతివేగంతో కారు నడుపుతూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్‌ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. రాజగోపాలపేట పోలీసుల కథనం ప్రకారం..నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ముక్కెర అయిలయ్య(60), ఆయన వియ్యంకుడైన.. బద్దిపడగ గ్రామానికి చెందిన కట్ట రవి(55)తో కలిసి బద్దిపడగ గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నారు. దుద్దెడకు చెందిన జక్కుల అనిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో హుస్నాబాద్‌లో శుభకార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. రాంపూర్‌ శివారులో కాలువ కట్ట మీదుగా అతివేగంతో వస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో రెండు వాహనాలు పక్కనే ఉన్న కాలువలో పడిపోయాయి. ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరితోపాటు కారులో ప్రయాణిస్తున్న జక్కుల మమత(28) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో అయిదుగురు పిల్లలు, నలుగురు పెద్దవారు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు